బాలకృష్ణ 111వ చిత్రంలో హీరోయిన్ గా లేడీ సూపర్‌స్టార్... అధికారిక ప్రకటన

  • బాలకృష్ణ 111వ సినిమాలో హీరోయిన్‌గా నయనతార ఖరారు
  • ఆమె పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్
  • ‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో రెండో చిత్రం
  • భారీ బడ్జెట్‌తో చారిత్రక కథాంశంతో సినిమా నిర్మాణం
  • నవంబర్‌లో ఈ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించే అవకాశం
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘NBK111’ నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మంగళవారం నయనతార పుట్టినరోజును పురస్కరించుకుని ఈ విషయాన్ని వెల్లడించింది.

ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని తన ఎక్స్ ఖాతాలో.. "క్వీన్ నయనతార గారికి NBK111 ప్రపంచంలోకి స్వాగతం. మా కథలో ఆమె శక్తి, గాంభీర్యం ఉన్నందుకు గౌరవంగా భావిస్తున్నాం. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మిమ్మల్ని త్వరలో సెట్‌లో కలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం" అని పోస్ట్ చేశారు. నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ కూడా నయనతారకు స్వాగతం పలుకుతూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.

‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇది ఒక చారిత్రక ఇతివృత్తంతో రూపొందుతుండగా, బాలకృష్ణను మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో చూపించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ సినిమాను నవంబర్‌లో లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కోసం రాజస్థాన్‌లోని పలు అందమైన లొకేషన్లను చిత్ర యూనిట్ పరిశీలించింది. బాలయ్య, నయన్ కాంబోలో ఇది మరో బ్లాక్‌బస్టర్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News