మొబైల్ IMEI నంబర్ మార్చితే మూడేళ్ల జైలు.. కేంద్రం తీవ్ర హెచ్చరిక

  • మొబైల్ IMEI నంబర్ ట్యాంపరింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు
  • ఇకపై ఇది బెయిల్‌కు వీలులేని నేరంగా పరిగణన
  • గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ. 50 లక్షల జరిమానా విధింపు
  • తయారీదారులు, విక్రయదారులకు టెలికాం శాఖ హెచ్చరిక
మొబైల్ ఫోన్ల ప్రత్యేక గుర్తింపు సంఖ్య అయిన 15 అంకెల IMEI (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ) నంబర్‌ను ట్యాంపరింగ్ చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇకపై IMEI నంబర్‌ను మార్చడం బెయిల్‌కు వీలులేని (నాన్-బెయిలబుల్) నేరంగా పరిగణించనున్నట్లు కేంద్ర టెలికాం శాఖ (DoT) సోమవారం స్పష్టం చేసింది. ఈ నేరానికి పాల్పడిన వారికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ. 50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించనున్నట్లు హెచ్చరించింది.

ఈ మేరకు మొబైల్ ఫోన్ల తయారీదారులు, బ్రాండ్ యజమానులు, దిగుమతిదారులు, విక్రయదారులందరికీ టెలికాం శాఖ ఒక ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది. కొత్తగా అమల్లోకి వచ్చిన "టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023" ప్రకారం ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ప్రతి ఒక్కరూ చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.

"టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023 ప్రకారం.. IMEI నంబర్లు సహా ఇతర టెలికాం ఐడెంటిఫైయర్లను ట్యాంపరింగ్ చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించబడతాయి" అని టెలికాం శాఖ తన ప్రకటనలో పేర్కొంది. దొంగిలించబడిన ఫోన్లను గుర్తించకుండా ఉండేందుకు IMEI నంబర్లను మార్చడం వంటి అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.


More Telugu News