India Cricket Team: నాగ్‌పూర్‌ టీ20లో టీమిండియా భారీ విజయం... సిరీస్ లో ముందంజ

India Cricket Team Wins Nagpur T20 Against New Zealand
  • తొలి టీ20లో న్యూజిలాండ్‌పై 48 పరుగులే తేడాతో భారత్ ఘన విజయం
  • తొలుత 7 వికెట్లకు 238 పరుగుల భారీ స్కోరు చేసిన టీమిండియా
  • ఛేజింగ్ లో 7 వికెట్లకు 190 పరుగులే చేసిన కివీస్
నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై  ఘన విజయం సాధించింది. 239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ చివరికి 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. సంజూ శాంసన్ (10), ఇషాన్ కిషన్ (8) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ, కేవలం 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 84 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32) అతనికి చక్కటి సహకారం అందించాడు. చివర్లో రింకూ సింగ్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

భారీ లక్ష్యఛేదనలో కివీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ డెవాన్ కాన్వే (0), రచిన్ రవీంద్ర (1) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. అయితే, గ్లెన్ ఫిలిప్స్ 40 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. అతనికి మార్క్ చాప్‌మన్ (39) జత కలిసినప్పటికీ, భారీ లక్ష్యం ముందు వారి పోరాటం సరిపోలేదు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో కివీస్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది.

భారత బౌలర్లలో శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు పడగొట్టగా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
India Cricket Team
Nagpur T20
India vs New Zealand
Abhishek Sharma
Suryakumar Yadav
Rinku Singh
Glenn Phillips
Shivam Dube
Cricket Series

More Telugu News