Chandrababu Naidu: దుబాయ్ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు ఏపీ సిద్ధం... యూఏఈకి సీఎం చంద్రబాబు ప్రతిపాదన

Chandrababu Naidu Proposes Dubai Food Cluster in Andhra Pradesh to UAE
  • ప్రపంచ ఆర్థిక సదస్సులో యూఏఈ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ
  • ఏపీలో దుబాయ్ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుపై కీలక చర్చలు
  • పారిశ్రామిక పార్కులు, ఇంధన రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం
  • సీఎం చంద్రబాబు ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన యూఏఈ మంత్రి
  • ఏపీలో ఉన్న మౌలిక సదుపాయాలను వివరించిన ముఖ్యమంత్రి
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF) వేదికగా ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ థాని బిన్ అహ్మద్ అల్ జయేదీతో బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తూ, పలు కీలక రంగాల్లో భాగస్వామ్యం కావాలని యూఏఈని ఆహ్వానించారు. ఈ భేటీలో ప్రధానంగా ఏపీలో 'దుబాయ్ ఫుడ్ క్లస్టర్' ఏర్పాటు ప్రతిపాదనపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సమావేశంలో అగ్రిటెక్, ఫుడ్ టెక్, ఆక్వా టెక్నాలజీలతో పాటు ఫుడ్ పార్కుల అభివృద్ధి, ఆహార భద్రత వంటి కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ, ఆక్వా, ఉద్యాన ఉత్పత్తులు అధికంగా ఉన్నాయని, వాటిని ప్రాసెస్ చేసి అంతర్జాతీయ మార్కెట్లకు తరలించేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఆహార ఉత్పత్తులను వేగంగా, సులభంగా రవాణా చేయడానికి అవసరమైన పోర్టులు, విమానాశ్రయాలు, రోడ్డు, రైలు మార్గాలతో కూడిన పటిష్టమైన నెట్‌వర్క్‌ ఏపీలో ఉందని తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్రం గుండా వెళ్తున్న జాతీయ పారిశ్రామిక కారిడార్లు లాజిస్టిక్స్‌కు మరింత ఊతమిస్తాయని యూఏఈ మంత్రికి వివరించారు.

ఈ నేపథ్యంలో యూఏఈకి చెందిన డీపీ వరల్డ్, షరాఫ్ గ్రూప్, ట్రాన్స్‌వరల్డ్, ఏడీ పోర్ట్స్, యాడ్నాక్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు ఏపీలో పారిశ్రామిక పార్కులు నెలకొల్పే అవకాశాన్ని పరిశీలించాలని చంద్రబాబు కోరారు. ఏపీ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతితో పాటు, ఇక్కడే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు స్థాపించాలని సూచించారు.

పునరుత్పాదక ఇంధన రంగంలోనూ ఏపీ అపార అవకాశాలను అందిస్తోందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈకి చెందిన టాక్వా, మజ్దార్ వంటి కంపెనీలకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా, ఏడీఐఏ (ADIA), ముబాద్లా, ఏడీక్యూ (ADQ) వంటి యూఏఈకి చెందిన సావరిన్ ఫండింగ్ సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చని సూచించారు. వీటితో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చేయనున్న స్పేస్, డ్రోన్ సిటీల నిర్మాణంలోనూ యూఏఈ భాగస్వామ్యం కావాలని చంద్రబాబు ప్రతిపాదించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రతిపాదనలు, వివరించిన అవకాశాలపై యూఏఈ విదేశీ వాణిజ్య మంత్రి థాని బిన్ అహ్మద్ సానుకూలంగా స్పందించారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని ఆయన ప్రశంసించినట్లు సమాచారం. ఈ సమావేశం ఏపీ-యూఏఈ వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఇరువర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
Chandrababu Naidu
Andhra Pradesh
UAE
Dubai Food Cluster
AP Investments
Food Processing
Renewable Energy
AgriTech
AP Industrial Parks
Thani bin Ahmed Al Zeyoudi

More Telugu News