ఆయుధాల నిల్వల ఆరోపణలు... బెంగాల్ రాజ్ భవన్‌లో తనిఖీలు

  • రాజ్ భవన్ ప్రాంగణంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి నిల్వ చేశారని టీఎంసీ ఎంపీ ఆరోపణ
  • ఉత్తర బెంగాల్ పర్యటనను రద్దు చేసుకుని వచ్చిన గవర్నర్
  • జర్నలిస్టుల సమక్షంలో తనిఖీల నిర్వహణ
ఆయుధాల నిల్వల ఆరోపణల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాజ్ భవన్‌లో కేంద్ర బలగాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ ఘటన బెంగాల్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రాజ్ భవన్ ప్రాంగణంలో ఆయుధాలు, మందు గుండు సామగ్రిని నిల్వ చేశారని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో, గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఈరోజు రాజ్ భవన్‌లో పోలీసులు, కేంద్ర బలగాలు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ బృందాలతో తనిఖీలు నిర్వహించారు.

పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కొనసాగుతోంది. ఈ తరుణంలో ఎన్నికల ప్రక్రియ ప్రక్షాళన అవసరమని గవర్నర్ వ్యాఖ్యానించారు.

గవర్నర్ ఎస్ఐఆర్‌ను సమర్థించినట్లుగా వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే తృణమూల్ ఎంపీ ఆయుధాల నిల్వలంటూ ఆరోపణలు గుప్పించారు. రాజ్ భవన్ లోపల బీజేపీ నేరస్థులకు గవర్నర్ ఆశ్రయం కల్పించి, వారికి బాంబులు, తుపాకులు సమకూర్చారని సంచలన ఆరోపణలు చేశారు.

ఈ క్రమంలో తన ఉత్తర బెంగాల్ పర్యటనను రద్దు చేసుకుని వచ్చిన గవర్నర్ ఆనంద్ బోస్, రాజ్ భవన్ ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. పోలీస్ అవుట్ పోస్టు వద్ద సిబ్బందిని మోహరించి జర్నలిస్టుల సమక్షంలో, ప్రత్యేక ప్రసారంతో తనిఖీలు నిర్వహించారు.


More Telugu News