ఐ-బొమ్మ రవి తెలివి చూసి షాకయ్యా.. దేశానికి ఇలాంటి వాళ్లు ఉపయోగపడతారు!: నటుడు శివాజీ

  • రవి లాంటి తెలివైన యువకుడిని మంచి కోసం ఉపయోగించుకోవాలన్న శివాజీ
  • రవి తెలిసీ తెలియని వయస్సులో డబ్బు కోసం ఏదో చేసి ఉంటాడన్న శివాజీ
  • అతను ఇప్పటికైనా మారాలని శివాజీ హితవు
ఐ-బొమ్మ రవి వంటి తెలివైన యువకుడిని సద్వినియోగం చేసుకోవాలని, దేశానికి ఇలాంటి ప్రతిభావంతులు ఉపయోగపడతారని ప్రముఖ సినీ నటుడు శివాజీ అభిప్రాయపడ్డారు. సెక్యూరిటీ ఫోర్సులో ఇలాంటి వారిని తీసుకోవాలని, మంచి కోసం అటువంటి వారి సేవలు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. రవి చిన్న వయస్సులో డబ్బు కోసం ఏదో చేసి ఉండవచ్చని ఆయన అన్నారు.

నటుడు శివాజీ కీలక పాత్రలో నటించిన 'దండోరా' డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా టీజర్ విడుదల వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో శివాజీ మాట్లాడుతూ, ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి తెలివితేటలను చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. రవి ఇకనైనా మారాలని హితవు పలికారు.

ఐ-బొమ్మ ద్వారా తాను చాలా మందికి ఉపయోగపడుతున్నానని రవి భావించి ఉండవచ్చని, కానీ అది ఎంతో మందిని ఇబ్బంది పెట్టిందని ఆయన అన్నారు. మనకంటూ కొన్ని నియమాలు ఉన్నాయని, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని సూచించారు. రవిలో ఇప్పటికైనా మార్పు రావాలని ఆకాంక్షించారు. సినిమాను థియేటర్‌లో చూసే అనుభూతి మరెక్కడా లభించదని అన్నారు.

థియేటర్‌‌లో చిప్స్ ప్యాకెట్ కొంటే రూ. 100 ఉంటుందని, అందులో కనీసం 20 చిప్స్ కూడా ఉండవని అన్నారు. ప్రపంచంలో అన్నింటికంటే చౌకైనది ఏదైనా ఉందాంటే అది సినిమా మాత్రమేనని అన్నారు. మూడు గంటల సినిమా నచ్చితే జీవితాంతం గుర్తుండిపోతుందని అన్నారు. ఎన్టీఆర్ నటించిన మిస్సమ్మ, పాతాళ భైరవి సినిమాలు ఇప్పటికీ గుర్తున్నాయని తెలిపారు. దయచేసి అందరూ థియేటర్‌లోనే సినిమాలు చూడాలని విజ్ఞప్తి చేశారు.


More Telugu News