మేం కూడా డిజిటల్ అరెస్ట్ బాధితులమే: నాగార్జున

  • మా కుటుంబంలో ఒకరిని రెండు రోజుల పాటు నిర్భంధించారు
  • పోలీసులకు సమాచారం అందించేలోపు మోసగాళ్లు తప్పించుకున్నారని వెల్లడి
  • హైదరాబాద్ సీపీ సజ్జనార్ తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సినీ నటుడు
డిజిటల్ అరెస్టు మోసాలపై సినీ నటుడు నాగార్జున సంచలన విషయం వెల్లడించారు. తమ కుటుంబంలోనూ ఒకరు ఈ మోసగాళ్ల బారిన పడ్డారని, రెండు రోజుల పాటు ఇంట్లోనే నిర్బంధానికి గురయ్యారని తెలిపారు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లేలోపు మోసగాళ్లు తప్పించుకున్నారని పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం హైదరాబాద్ సీపీ సజ్జనార్ తో భేటీ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో నాగార్జున ఈ వివరాలు వెల్లడించారు.
 
ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు తదితరులు హైదరాబాద్ సీపీ సజ్జనార్ ను ఆయన ఆఫీసుకు వెళ్లి కలిశారు. అనంతరం మీడియా సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ.. పైరసీని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశాక చెన్నై నుంచి తన స్నేహితుడు ఒకరు ఫోన్ చేశారని, తాము చేయలేని పని అక్కడ మీరు చేశారని చెప్పాడు.

ఐబొమ్మతో పాటు పైరసీ సైట్ల నిర్వాహకుల అసలు ఉద్దేశం వేరే ఉందని, ప్రజలకు ఉచితంగా సినిమాలు చూపించాలనేది వారి మోసానికి తొడుగులాంటిదని హెచ్చరించారు. దీని వెనక అంతర్జాతీయ ముఠా ఉందన్నారు. ఉచిత సినిమాల పేరుతో ట్రాప్ చేసి డేటా సేకరిస్తున్నారని, ఈ డేటాతో భారీ మోసానికి పాల్పడతారని నాగార్జున చెప్పారు. ఒక్క ఇమ్మడి రవి దగ్గరే 50 లక్షల మంది సబ్ స్క్రయిబర్ల డేటా ఉందని పోలీసులు చెప్పిన విషయాన్ని నాగార్జున గుర్తు చేశారు. కేవలం రూ.20 కోట్ల కోసం నిందితులు ఇదంతా చేయడం లేదన్నారు. ఈ వ్యవహారంలో రూ. వేల కోట్లు దోచేసే పెద్ద ప్లాన్‌ ఉంటుందని ప్రజలను ఆయన హెచ్చరించారు.


More Telugu News