కేంద్ర ప్రభుత్వ ఏఐ కోర్సులు... ఇవి పూర్తిగా ఉచితం!

  • స్వయం పోర్టల్‌లో ఉచిత ఏఐ కోర్సులను ప్రారంభించిన కేంద్రం
  • కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ గుర్తింపు సర్టిఫికెట్
  • విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిపుణులకు చక్కటి అవకాశం
  • టెక్నాలజీ, సైన్స్, స్పోర్ట్స్, ఫైనాన్స్ రంగాల్లో ప్రత్యేక కోర్సులు
దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీకి ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఏఐ నైపుణ్యాలను ఉచితంగా అందించేందుకు 'స్వయం' (SWAYAM) పోర్టల్ ద్వారా పలు కొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ప్రభుత్వ గుర్తింపుతో కూడిన సర్టిఫికెట్ కూడా లభిస్తుంది.

ఈ కోర్సులు విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివిధ రంగాల నిపుణులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. పైథాన్ ఉపయోగించి ఏఐ, మెషిన్ లెర్నింగ్ ప్రాథమిక అంశాల నుంచి మొదలుకొని, క్రికెట్ విశ్లేషణలో ఏఐ వాడకం, ఉపాధ్యాయులకు తరగతి గదిలో ఏఐ వినియోగం వంటి వినూత్న కోర్సులు ఉన్నాయి. వీటితో పాటు భౌతిక, రసాయన శాస్త్రాల్లో పరిశోధనలకు, ఫైనాన్స్, అకౌంటింగ్ రంగాల్లో ఆటోమేషన్‌కు ఏఐను ఎలా ఉపయోగించవచ్చో నేర్పే కోర్సులు కూడా ఉన్నాయి.

ఈ కోర్సుల ద్వారా ప్రాక్టికల్ నైపుణ్యాలు నేర్చుకుని, నిజ జీవిత సమస్యలకు పరిష్కారాలు కనుగొనే సామర్థ్యం పెరుగుతుంది. స్పోర్ట్స్ జర్నలిస్టుల నుంచి సైన్స్ విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా వీటిని తీర్చిదిద్దారు.

ఆసక్తి ఉన్నవారు ఎవరైనా స్వయం అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి, తమకు నచ్చిన కోర్సును ఎంచుకుని సులభంగా నమోదు చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీతో లాగిన్ అయి ఈ ఉచిత కోర్సుల్లో చేరవచ్చు. డిజిటల్ నైపుణ్యాలు పెంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇది ఒక మంచి అవకాశం. 


More Telugu News