ఇంధన రంగానికి సైబర్ కవచం.. వరల్డ్ ఎకనమిక్ ఫోరంతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం

  • ఏపీ ఇంధన రంగంలో కొత్త శకం
  • విద్యుత్ వ్యవస్థల భద్రతకు ప్రత్యేక కేంద్రం
  • విద్యుత్ వ్యవస్థల రక్షణకు సెంటర్ ఫర్ ఎనర్జీ సైబర్ రెజిలియన్స్ సెంటర్ ఏర్పాటు
  • ఏఐ టెక్నాలజీతో విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గిస్తామన్న సీఎం చంద్రబాబు
  • డేటా సెంటర్లకు తక్కువ వ్యయంతో విద్యుత్ అందించడమే లక్ష్యమన్న మంత్రి లోకేశ్
ఇంధన భద్రత, సైబర్ రక్షణ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసింది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యుత్ వ్యవస్థలను పటిష్ఠం చేయడంతో పాటు, వాటికి సైబర్ దాడుల నుంచి రక్షణ కల్పించడమే లక్ష్యంగా 'సెంటర్ ఫర్ ఎనర్జీ సైబర్ రెజిలియన్స్ సెంటర్' (CECRC) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. విశాఖపట్నంలో శనివారం జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) మధ్య ఈ కీలక ఒప్పందం కుదిరింది. ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా ఇంధన రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే, సైబర్ భద్రతా ప్రమాణాలను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ఇంధన రంగంలో సాంకేతికత వినియోగం ఎంత ముఖ్యమో, సైబర్ రక్షణ కూడా అంతే కీలకమని ఉద్ఘాటించారు. "ప్రపంచమంతా ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ వైపు చూస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 160 గిగావాట్ల హరిత విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే, విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే కాదు, దానిని ప్రజలకు అతి తక్కువ వ్యయంతో, సురక్షితంగా అందించడం కూడా ప్రభుత్వ బాధ్యత. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించి విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించాలి. అప్పుడే ఈ రంగంలో సుస్థిరత సాధ్యమవుతుంది" అని ఆయన వివరించారు.

వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు ప్రతి రంగానికి విద్యుత్ అత్యవసరమని, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వికేంద్రీకృత ఉత్పత్తి విధానాలపై దృష్టి సారించామని చంద్రబాబు తెలిపారు. 

"ఎక్కడికక్కడే విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునేలా ప్రణాళికలు రచిస్తున్నాం. తద్వారా ట్రాన్స్‌మిషన్ నష్టాలను తగ్గించి, ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చవచ్చు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద రాష్ట్రంలో సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులను వేగవంతం చేశాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి వినియోగాన్ని పెంచిన అనుభవం మాకుంది. ఇప్పుడు అదే స్ఫూర్తితో, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఇంధన వ్యవస్థలను తీర్చిదిద్దుతున్నాం" అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు డబ్ల్యూఈఎఫ్ ముందుకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

తక్కువ వ్యయంతో నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తిపై చంద్రబాబు దృష్టి సారించారు: మంత్రి నారా లోకేశ్ 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతోందన్నారు. "విశాఖకు 6 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్‌ను తీసుకురావాలన్న మా కల సాకారమైంది. అయితే, ఇలాంటి డేటా సెంటర్లకు నిరంతరాయంగా, తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యుత్ అందించడం ఒక పెద్ద సవాలు. అధిక ధరలకు విద్యుత్‌ను అందిస్తే పెట్టుబడులపై ప్రభావం పడుతుంది. అందుకే సీఎం చంద్రబాబు ఆధునిక టెక్నాలజీతో తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించారు. ఈ రోజు ఏర్పాటు చేస్తున్న సైబర్ రెజిలియన్స్ సెంటర్, మన విద్యుత్ వ్యవస్థలకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది" అని లోకేశ్ పేర్కొన్నారు.

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, "రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ తరుణంలో మన విద్యుత్ గ్రిడ్లు, వ్యవస్థల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ సైబర్ రెజిలియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం" అని తెలిపారు.

వరల్డ్ ఎకనమిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జుర్గెన్స్ మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వ ముందుచూపును ప్రశంసించారు. "ఏఐ వంటి సాంకేతిక విప్లవం చోటుచేసుకుంటున్న ఈ సమయంలో ఇంధన వ్యవస్థల భద్రత అనేది అత్యంత కీలకమైన అంశం. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకోవడం అభినందనీయం. భారత్‌లో ఇంధన రంగంలో వేగంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. సామాజికంగా, ఆర్థికంగా స్వావలంబన సాధించాలంటే ఇలాంటి భద్రతా కేంద్రాలు ఎంతో అవసరం" అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.


More Telugu News