బీహార్​ ఫలితాలను ముందే చెప్పిన కేంద్ర మాజీ మంత్రి.. కాకపోతే వ్యంగ్యంగా!

  • ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తప్పే.. ఎన్డీయే 200 సీట్లను గెల్చుకుంటుందన్న యశ్వంత్ సిన్హా
  • నవంబర్ 11న ఎక్స్ లో పోస్ట్ చేసిన తృణమూల్ నేత
  • ఫలితాల తర్వాత సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు
  • జ్ఞానేశ్ సీఈసీగా ఉన్నంత కాలం ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయొద్దంటూ ట్వీట్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. ఫలితాల్లో ఆ అంచనాలను ఎన్డీయే మించిపోయింది. ఏకంగా 202 సీట్లను గెల్చుకుంది. అయితే, ఈ విషయాన్ని కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత యశ్వంత్ సిన్హా ముందే చెప్పారు. నవంబర్ 11న ఆయన ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు.

‘ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయే మెజారిటీ సీట్లను గెల్చుకుంటుందని అంచనా వేశాయి. కానీ అవన్నీ తప్పు. నా సర్వే ప్రకారం ఎన్డీయే ఏకంగా 200 సీట్లు గెల్చుకుంటుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్షాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. నా అంచనా తప్పైతే దానికి నేను ఎలాంటి బాధ్యత వహించను’ అంటూ వ్యంగ్యంగా పోస్టు పెట్టారు. తీరా నవంబర్ 14న వెలువడ్డ ఫలితాల్లో యశ్వంత్ సిన్హా జోస్యం నిజమైంది. దీంతో కేంద్రంలో రెండుసార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా పోస్టు కాస్తా చర్చనీయాంశంగా మారింది.

అసెంబ్లీ ఫలితాలపై మరో ట్వీట్..
బీహార్ అసెంబ్లీ ఫలితాల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించిన నేపథ్యంలో యశ్వంత్ సిన్హా మరోమారు ట్వీట్ చేశారు. ఎన్నికల సంఘంపైన, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రక్రియపైనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘సీఈసీ పోస్టులో జ్ఞానేశ్ కుమార్ ఉన్నంత కాలం.. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటే బెటర్’ అని విమర్శించారు.


More Telugu News