ఈ నెల 19న పీఎం కిసాన్ నిధుల విడుదల

  • ఈ నెల 19న పీఎం కిసాన్ 21వ విడత నిధులు విడుదల  చేస్తామన్న కేంద్ర మంత్రి చౌహాన్
  • ప్రధాని నరేంద్ర మోదీ రైతుల ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేయనున్నారని వెల్లడి
  • దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి కలుగుతుందన్న మంత్రి
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం కింద 21వ విడత నిధులను ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
 
అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 24న పీఎం-కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏటా మూడు విడతల్లో రూ.6,000 ఆర్థిక సాయం అందుతోంది. ఇప్పటివరకు 20 విడతల్లో దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
 
ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే రైతుల భూమి వివరాలు తప్పనిసరిగా పీఎం-కిసాన్ పోర్టల్‌లో నమోదై ఉండాలి. అలాగే, బ్యాంకు ఖాతాకు ఆధార్‌ అనుసంధానం కూడా తప్పనిసరి. ఈ నిబంధనలు పాటించిన రైతులకే 21వ విడత నిధులు వారి ఖాతాల్లో జమ అవుతాయి.


More Telugu News