పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీశ్ కుమార్ ది హత్యే... డాక్టర్ల ప్రాథమిక నిర్ధారణ

  • పోస్టుమార్టంలో వెలుగులోకి వచ్చిన కీలక నిజాలు
  • తల వెనుక గొడ్డలితో నరికినట్లు గుర్తింపు
  • శరీరంలో పలుచోట్ల విరిగిన ఎముకలు
  • దర్యాప్తు కోసం 12 ప్రత్యేక పోలీసు బృందాల ఏర్పాటు
  • తాడిపత్రి సమీపంలో రైలు పట్టాలపై లభ్యమైన మృతదేహం
తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి కేసులో ఫిర్యాదుదారుడైన సతీశ్ కుమార్ మృతి కేసులో మిస్టరీ వీడింది. ఆయనది ప్రమాదవశాత్తు మరణం కాదని, పక్కా హత్యేనని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. సతీశ్ తల వెనుక భాగంలో గొడ్డలి వంటి పదునైన ఆయుధంతో నరికి చంపినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

అనంతపురం జిల్లా కలెక్టర్ ప్రత్యేక అనుమతితో అనంతపురం సర్వజన ఆసుపత్రిలో సతీశ్ కుమార్ మృతదేహానికి శుక్రవారం శవపరీక్ష నిర్వహించారు. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో సీటీ స్కాన్ కూడా చేశారు. పోస్టుమార్టంలో సతీశ్ శరీరంలోని పలుచోట్ల ఎముకలు విరిగిపోయినట్లు, తీవ్ర గాయాలున్నట్లు వైద్యులు గుర్తించారు. తెల్లవారుజామున 2 నుంచి 4 గంటల మధ్య ఆయన మృతి చెంది ఉండవచ్చని అంచనా వేశారు.

పరకామణి కేసు విచారణకు హాజరయ్యేందుకు సతీశ్ కుమార్ గురువారం రాత్రి గుంతకల్‌లో రైలు ఎక్కారు. అయితే, అనూహ్యంగా తాడిపత్రి సమీపంలోని రైలు పట్టాల పక్కన ఆయన శవమై కనిపించడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ స్వయంగా దగ్గరుండి పోస్టుమార్టం ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ కేసును ఛేదించేందుకు 12 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సతీశ్ కుమార్ ఫోన్ ను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.

గతంలో టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ గా పనిచేసిన సతీశ్ కుమార్ ప్రస్తుతం గుంతకల్లులో జీఆర్ పీ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నారు.


More Telugu News