'యాక్షన్ టెసా'కు మంత్రి లోకేశ్ ఆఫర్... ఏపీలో తయారీ యూనిట్

  • యాక్షన్ టెసా సీఈవో వివేక్ జైన్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ
  • విశాఖలో జరుగుతున్న సీఐఐ సమ్మిట్‌లో కీలక చర్చలు
  • ఏపీలో తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని లోకేశ్ ఆహ్వానం
  • సెకండరీ ఎండిఎఫ్ యూనిట్‌పై మంత్రి ప్రతిపాదన
  • ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలిస్తామన్న కంపెనీ సీఈవో
  • దేశంలోనే ప్రముఖ ఇంజనీర్డ్ కలప తయారీ సంస్థ యాక్షన్ టెసా
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రముఖ ఇంజనీర్డ్ కలప ప్యానెల్ తయారీ సంస్థ 'యాక్షన్ టెసా'ను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆహ్వానించారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో మంత్రి నారా లోకేశ్, యాక్షన్ టెసా ఎండీ, సీఈవో వివేక్ జైన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో తయారీ యూనిట్ ఏర్పాటుకు గల అవకాశాలను లోకేశ్ వివరించారు.

రాష్ట్రంలో సెకండరీ లేదా శాటిలైట్ ఎండీఎఫ్ (మీడియం డెన్సిటీ ఫైబర్‌బోర్డ్) తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ సూచించారు. "ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్‌లో ఉన్న మీ ప్రధాన తయారీ కేంద్రం 7.5 లక్షల క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో పనిచేస్తోంది. ఏపీలో మరో యూనిట్ ఏర్పాటు చేస్తే, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా అదనపు తయారీకి మద్దతు లభిస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.

మంత్రి లోకేశ్ ప్రతిపాదనపై వివేక్ జైన్ సానుకూలంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తమ సంస్థ కార్యకలాపాలను వివరిస్తూ.. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థలో ప్రస్తుతం 2,846 మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. 2018లో ఏడో తరం కాంటిరోల్ టెక్నాలజీని, ఉత్పత్తి వైవిధ్యం కోసం డోమ్ టెక్నాలజీని ప్రవేశపెట్టినట్లు వివరించారు.

1970లలో ప్రారంభమైన యాక్షన్ టెసా సంస్థ ఇంజనీర్డ్ కలప ఉత్పత్తులతో పాటు పాదరక్షలు, ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేట్ వంటి పలు రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2025లో రూ.4,865 కోట్ల వార్షిక రెవిన్యూ సాధించిన ఈ సంస్థకు దేశవ్యాప్తంగా విస్తృతమైన నెట్‌వర్క్ ఉంది.


More Telugu News