నాపై దుష్ప్రచారం చేసి గెలవాలనుకున్నారు: 'జూబ్లీహిల్స్' విజేత నవీన్ యాదవ్

  • తనపై దుష్ప్రచారం చేశారన్న నవీన్ యాదవ్
  • ప్రజలు ఓటు హక్కుతో తిప్పికొట్టారన్న నవీన్ యాదవ్
  • ఎన్నికలు ముగిశాయి.. అందరం కలిసి అభివృద్ధి కోసం పని చేద్దామని పిలుపు
గతంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేదని, ప్రజలకు ఆ విషయం చెప్పుకోలేక తమపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలని చూసిందని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నారు. ప్రజలందరూ తమ ఓటుతో బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారాలను తిప్పికొట్టారని ఆయన అన్నారు. రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పత్రం అందుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భారీ మెజార్టీతో గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తన విజయం కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనపై నమ్మకంతో ఓట్లు వేశారని ఆయన అన్నారు. ఈరోజుతో ఎన్నికలు ముగిశాయని, మనమందరం కలిసి మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు తనపై తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. బెదిరిస్తే ప్రజలు ఓటు వేసే రోజులు ఎప్పుడో పోయాయని ఆయన అన్నారు. తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపిన నవీన్ యాదవ్, నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.


More Telugu News