బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన మజ్లిస్ పార్టీ.. కొచ్చధామన్ సీటు గెలుపు

  • ముస్లిం జనాభా అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో పలు స్థానాల్లో మజ్లిస్ ఆధిక్యం
  • కొచ్చధామన్ నియోజకవర్గం నుంచి మజ్లిస్ అభ్యర్థి ఎండి సర్వార్ ఆలమ్ గెలుపు
  • సమీప ఆర్జేడీ అభ్యర్థి ముజాహిద్ ఆలమ్‌పై 23,021 ఓట్ల మెజార్టీ
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఖాతాను తెరిచింది. ముస్లిం జనాభా అధికంగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో మజ్లిస్ పార్టీ పలు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ, ఒక స్థానంలో విజయం సాధించింది. కొచ్చధామన్ నియోజకవర్గం నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎండీ సర్వార్ ఆలమ్ గెలుపొందారు.

సర్వార్ ఆలమ్ తన సమీప ఆర్జేడీ అభ్యర్థి ముజాహిద్ ఆలమ్‌పై 20 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సర్వార్ ఆలమ్‌కు 81,860 ఓట్లు రాగా, ఆర్జేడీ అభ్యర్థి ముజాహిద్ ఆలమ్ కు 58,839 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బినాదేవికి 44,858 ఓట్లు వచ్చాయి.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి అద్భుత విజయాన్ని నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. 243 స్థానాలకు గాను ఈ కూటమి 200కి పైగా సీట్లలో విజయం సాధించే అవకాశం ఉంది. మహాఘట్‌బంధన్ 36 సీట్లకు పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఎన్డీయే కూటమిలో బీజేపీ 94, జేడీయూ 78, ఎల్‌జేపీ (ఆర్వీ) 19, హెచ్ఏఎం (ఎస్) 5, ఆర్ఎల్ఎం 4 సీట్లలో ముందంజలో ఉన్నాయి లేదా గెలుపొందాయి. మహాఘట్‌బంధన్‌లో ఆర్జేడీ 29, కాంగ్రెస్ 4 సీట్లలో ముందంజలో ఉన్నాయి లేదా గెలుపొందాయి.


More Telugu News