బుమ్రా దెబ్బకు సఫారీలు విలవిల.. 159 పరుగులకే ఆలౌట్

  • తొలి టెస్టులో చెలరేగిన పేసర్ జస్ప్రీత్ బుమ్రా
  • కేవలం 27 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టిన భారత స్టార్
  • తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలకు ఎదురుదెబ్బ
  • ఒక దశలో 57/0.. ఆ తర్వాత 102 పరుగులకే 10 వికెట్లు
  • సిరాజ్, కుల్దీప్‌ యాదవ్‌లకు చెరో రెండు వికెట్లు
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజే టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో చెలరేగడంతో సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 159 పరుగులకే కుప్పకూలింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో బుమ్రా 27 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు రియాన్ రికెల్టన్ (23), ఐడెన్ మార్‌క్రమ్ (31) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించి పటిష్ట స్థితిలో నిలిపారు. అయితే బుమ్రా.. సఫారీల ఆశలను ఆవిరి చేశాడు. ఒకే స్పెల్‌లో ఇద్దరు ఓపెనర్లను పెవిలియన్ చేర్చడంతో దక్షిణాఫ్రికా పతనం మొదలైంది.

ఆ తర్వాత మిగతా బౌలర్లు కూడా రాణించడంతో దక్షిణాఫ్రికా కోలుకోలేకపోయింది. మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది. సఫారీ మిడిలార్డర్ బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి క్రీజులో నిలవలేకపోయారు.

టీ విరామం తర్వాత బుమ్రా మరింత విజృంభించి టెయిలెండర్ల పనిపట్టాడు. తన అద్భుతమైన బౌలింగ్‌తో టెస్టుల్లో 16వ సారి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. టాస్ గెలిచిన ప్రయోజనాన్ని దక్షిణాఫ్రికా సద్వినియోగం చేసుకోలేకపోగా, తొలి రోజే మ్యాచ్‌పై భారత్ పట్టు బిగించింది.


More Telugu News