జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, బీహార్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

    
రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. తొలుత బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. హైదరాబాద్, యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి  ఇండోర్ స్టేడియంలో ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ ఉండగా, ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీగా పోరాడాయి.

ఇక ఒక్కో రౌండ్ ఫలితం తేలడానికి కనీసం 40 నిమిషాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల కల్లా ఫలితం తేలిపోనుండగా, మరో గంటలో సరళి తెలిసిపోనుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇప్పటికే లెక్కింపు కేంద్రానికి చేరుకున్నారు. కాగా, ఎగ్జిట్  పోల్స్‌లో దాదాపు అన్ని సంస్థలు కాంగ్రెస్‌దే విజయమని తేల్చాయి. అయితే, ఓటింగ్ శాతంలో స్వల్ప తేడా ఇవ్వడంతో విజయంపై ఎవరికి వారే ధీమాతో ఉన్నారు.

పోస్టల్ బ్యాలెట్‌లో ఎన్డీయే దూకుడు
కాగా, రెండు విడతలుగా జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లలో 36 స్థానాల్లో ఎన్డీయే, 12 స్థానాల్లో మహాఘట్‌బంధన్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అలీనగర్‌లో గాయని, బీజేపీ అభ్యర్థి మైథిలి ఠాకూర్ వెనుకంజలో ఉన్నారు. రాఘోపూర్‌లో ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ ముందంజలో ఉన్నారు.


More Telugu News