భారతీయ విద్యార్థులకు రష్యా బంపర్ ఆఫర్.. 300 ఉచిత స్కాలర్‌షిప్‌లు

  • 2026-27 విద్యా సంవత్సరానికి అవకాశం
  • ట్యూషన్ ఫీజు పూర్తిగా ఉచితం
  • ఇంజినీరింగ్, మెడిసిన్‌తో పాటు పలు కోర్సులు
  • రష్యన్ రాకపోయినా ప్రత్యేక లాంగ్వేజ్ కోర్సు
  • దరఖాస్తులకు 2026 జనవరి 15 ఆఖ‌రి గ‌డువు
ఉన్నత విద్య కోసం రష్యా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను 300 ఫుల్లీ ఫండెడ్ స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. ఈ స్కాలర్‌షిప్‌ల ద్వారా ప్రముఖ రష్యన్ విశ్వవిద్యాలయాల్లో ఉచితంగా చదువుకునే అవకాశం భారతీయ విద్యార్థులకు లభించనుంది.

ఈ స్కాలర్‌షిప్‌లు అండర్ గ్రాడ్యుయేట్, స్పెషలిస్ట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ (మాస్టర్స్), డాక్టోరల్ ప్రోగ్రామ్‌లతో పాటు పలు అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ కోర్సులకు వర్తిస్తాయి. ఎంపికైన విద్యార్థులకు ట్యూషన్ ఫీజు పూర్తిగా ఉచితం. అయితే, లోమోనోసోవ్ మాస్కో స్టేట్ యూనివర్సిటీ, ఎంజీఐఎంవో (MGIMO) యూనివర్సిటీలకు ఈ ఫీజు మినహాయింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మెడిసిన్, ఫార్మసీ, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, అగ్రికల్చర్, మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్, హ్యుమానిటీస్, గణితం, స్పేస్ సైన్స్, ఏవియేషన్, క్రీడలు, కళలు వంటి అనేక విభాగాల్లో విద్యార్థులు తమకు నచ్చిన కోర్సును ఎంచుకోవచ్చు. ముఖ్యంగా మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి కొన్ని ప్రోగ్రామ్‌లు ఇంగ్లిష్ మీడియంలో కూడా అందుబాటులో ఉన్నాయి.

రష్యన్ భాష రాని విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాంటి వారి కోసం ప్రధాన కోర్సు ప్రారంభానికి ముందు ఏడాది పాటు ప్రత్యేకంగా భాషా శిక్షణా తరగతులు (ప్రిపరేటరీ లాంగ్వేజ్ కోర్సు) నిర్వహిస్తారు.

ఆసక్తి ఉన్న విద్యార్థులు అధికారిక పోర్టల్ education-in-russia.com ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టంగా సూచించింది. ఇతర మార్గాల్లో పంపిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో అకడమిక్ ప్రతిభ, రీసెర్చ్ పబ్లికేషన్లు, సిఫార్సు లేఖలు, పోటీ పరీక్షల్లో సాధించిన సర్టిఫికెట్ల ఆధారంగా దరఖాస్తులను పరిశీలిస్తారు. ఇందులో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు రెండో దశకు అర్హత సాధిస్తారు. ఈ దశలో రష్యా విద్యా, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ యూనివర్సిటీ కేటాయింపు, వీసా ప్రక్రియలను పర్యవేక్షిస్తుంది.

మొదటి దశ దరఖాస్తులకు చివరి తేదీ 2026 జనవరి 15. కాగా, ఈ స్కాలర్‌షిప్‌ల ఎంపిక ప్రక్రియలో తమకు ఎలాంటి పాత్ర లేదని భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.


More Telugu News