తెలంగాణను వణికిస్తున్న చలి పులి.. 8.2 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

  • చలికి గజగజ వణుకుతున్న ఉమ్మడి ఆదిలాబాద్
  • తిర్యాణిలో 8.2 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
  • రాష్ట్రంలోని 29 జిల్లాల్లో పెరిగిన చలి తీవ్రత
  • రానున్న మూడు రోజుల్లో మరింత పెరగనున్న చలి
  • సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం
  • పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రం చలితో గజగజ వణికిపోతోంది. ముఖ్యంగా అడవుల జిల్లాగా పేరున్న ఉమ్మడి ఆదిలాబాద్‌పై చలి పంజా విసురుతోంది. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి మండలంలో 8.2 డిగ్రీలుగా నమోదైంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం తిర్యాణి తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో 9.1 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో 9.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, ఖమ్మం, జోగులాంబ గద్వాల జిల్లాలు మినహా మిగిలిన 29 జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి. దీంతో చలి తీవ్రత రాష్ట్రమంతటా అధికంగా ఉంది.

ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు (శుక్ర, శని, ఆదివారాలు) రాష్ట్రంలో చలి ప్రభావం మరింత పెరగనుందని స్పష్టం చేసింది. కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే కూడా తక్కువకు పడిపోయే సూచనలు ఉన్నాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


More Telugu News