వేగమే వేదంగా పనిచేస్తున్నాం: సీఎం చంద్రబాబు

  • విశాఖ పెట్టుబడుల సదస్సుకు ముందే భారీగా ఒప్పందాలు
  • ఒక్కరోజే రూ.3.65 లక్షల కోట్లకు పైగా విలువైన 35 ఎంఓయూలు
  • గత ప్రభుత్వ హయాంలో వెళ్లిపోయిన కంపెనీల పునరాగమనం
  • పెట్టుబడుల ఆకర్షణలో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతామన్న సీఎం చంద్రబాబు
  • ఒక్కరోజులో 15కి పైగా సమావేశాలకు హాజరైన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడంలో కూటమి ప్రభుత్వం సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. విశాఖలో పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందే రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారింది. ఈ క్రమంలో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు 15కు పైగా సమావేశాల్లో పాల్గొని, సుడిగాలి పర్యటన చేశారు. తైవాన్, ఇటలీ రాయబారులతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "పెట్టుబడుల సదస్సుకు ముందే ఈ స్థాయిలో స్పందన రావడం సంతోషకరం. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ప్రతి పారిశ్రామికవేత్తకు ధన్యవాదాలు. రాష్ట్రాన్ని పెట్టుబడుల్లో నంబర్ 1 స్థానంలో నిలపడమే మా ధ్యేయం. వేగమే వేదంగా పనిచేస్తున్నాం" అని తెలిపారు.

రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరిస్తూ, "ఏపీకి వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం, పోర్టులు, మెరుగైన రోడ్డు, రైలు కనెక్టివిటీ ఉన్నాయి. దీంతో ఏపీ లాజిస్టిక్స్ రంగానికి కేంద్రంగా మారుతుంది. గ్రీన్ ఎనర్జీ, హార్టికల్చర్, ఆక్వా కల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అపార అవకాశాలున్నాయి. ఆలోచనలతో వచ్చేవారికి అన్ని విధాలా అండగా ఉంటాం. 'ఒక కుటుంబం-ఒక వ్యాపారవేత్త' నినాదంతో ముందుకెళుతున్నాం. 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానంతో అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదు" అని చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు.

గత ప్రభుత్వంలో వెళ్లిన కంపెనీలు వెనక్కి

గత ప్రభుత్వ విధానాలు నచ్చక రాష్ట్రం విడిచి వెళ్లిన రెన్యూ పవర్ వంటి పలు ప్రముఖ సంస్థలు తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం విశేషం. కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న పారిశ్రామిక అనుకూల వాతావరణానికి ఇది నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు రోజుల సదస్సులో మొత్తం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుండగా, తొలిరోజే మూడో వంతుకు పైగా లక్ష్యం నెరవేరడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇదే కార్యక్రమంలో, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ల కోసం బాలాజీ యాక్షన్ బిల్డ్‌వేర్ సంస్థ రూ.1 కోటి విరాళం చెక్కును ముఖ్యమంత్రికి అందజేసింది.



More Telugu News