ఎర్రకోట కారు బాంబు పేలుడు ఘటన... అధికారులకు అమిత్ షా ఆదేశాలు

  • ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతాయన్న అమిత్ షా
  • పేలుడు ఘటనపై ఉన్నతాధికారులతో రెండు సమీక్ష సమావేశాలు నిర్వహించిన అమిత్ షా
  • ప్రతి నిందితుడిని వేటాడాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడి
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు ఘటనపై కేంద్ర మంత్రి అమిత్ షా మరోసారి స్పందించారు. ఈ పేలుడుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు, ముఖ్య ప్రాంతాల్లో భద్రతపై ఉన్నతాధికారులతో ఆయన రెండు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. పేలుడు తర్వాత నెలకొన్న పరిస్థితులను అధికారులు అమిత్ షాకు వివరించారు.

ఈ సందర్భంగా అమిత్ షా 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. ఢిల్లీ కారు పేలుడుపై సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఘటనకు కారకులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి శిక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

కారు బాంబు ఘటనపై ఎన్ఎస్ఐ, ఎన్ఐఏ వంటి దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగినట్లు అమిత్ షా ఇదివరకే వెల్లడించారు. సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ ఈ పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అప్పగించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.


More Telugu News