ముమ్మరంగా తమ్మిడికుంట పునరుద్ధరణ... పరిశీలించిన హైడ్రా కమిషనర్

  • తమ్మిటికుంటను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్న హైడ్రా
  • ఆక్రమణలతో పాటు పూడికను తొలగించిన హైడ్రా
  • పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని రంగనాథ్ సూచన
ఐటీ కారిడార్‌ మాదాపూర్‌లో మ‌రో ఆక‌ర్ష‌ణ ప్రజలకు అందుబాటులోకి రానుంది. మురుగు నీటిని, దుర్గంధాన్ని వ‌దిలించుకుని సహజ సరస్సుగా త‌మ్మిడికుంట రూపుదిద్దుకుంటోంది. ముళ్ల‌ పొద‌లు, ప్లాస్టిక్ వ్య‌ర్థాలు, పేరుకుపోయిన పూడిక‌ను తొల‌గించి చెరువుకు సహజత్వాన్ని హైడ్రా అందిస్తోంది. చెరువులో ఆక్రమణలతో పాటు పూడిక‌ను తొల‌గించి విస్తీర్ణం పెంచ‌డంతో ఇప్పుడు ఆ ప‌రిస‌రాలు ఎంతో విశాలంగా మారాయి.

ఈ అభివృద్ధి ప‌నుల‌ను హైడ్రా కమిషనర్ ఏవీ రంగ‌నాథ్ సోమ‌వారం క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. చెరువు చుట్టూ ప‌టిష్ట‌మైన బండ్ నిర్మాణంతో పాటు ఇన్‌లెట్లు, ఔట్‌లెట్ల నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్న తీరును త‌నిఖీ చేశారు. ఐటీ కారిడార్లో ఉన్న ఈ చెరువును ఒక ప‌ర్యాట‌క ప్రాంతంగా తీర్చిదిద్దాలని హైడ్రా క‌మిష‌నర్ అధికారుల‌ను ఆదేశించారు. శిల్పారామం వద్ద వరద నీరు నిలవకుండా ఇన్‌లెట్లను అభివృద్ధి చేయాలని సూచించారు. 14 ఎక‌రాల చెరువును 29 ఎకరాలకు విస్తరించడం జరిగిందని, అదే విస్తీర్ణంలో నీరు నిలిచేలా చెరువు అభివృద్ధి చేయాలని సూచించారు.

సంద‌ర్శ‌కులు సేదతీరేలా

దేశం న‌లుమూల‌ల నుంచి వ‌చ్చిన ఐటీ నిపుణులు వచ్చే ప్రాంతం కావడంతో పాటు అత్యధిక జనసాంధ్రత ఉన్న ప్రాంతం కూడా ఇదేనని, ఇలాంటి చోట ఆహ్లాద‌కరమైన వాతావరణం ఉండేలా చూడాల‌ని హైడ్రా క‌మిష‌నర్ సూచించారు. త‌మ్మిడికుంట‌లో స్వ‌చ్ఛ‌మైన నీరు ఎంత ముఖ్య‌మో ఆ ప‌రిస‌రాలు కూడా అంతే ప‌రిశుభ్ర‌మైన వాతావ‌రణంలో ఉండటానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

చెరువు చుట్టూ దాదాపు 2 కిలోమీటర్ల మేర ఉన్న బండ్‌పై ప్రాణవాయువు అందించడంతో పాటు చల్లటి నీడనిచ్చే చెట్లు పెంచాలన్నారు. చెరువు ప్ర‌ధాన ప్ర‌వేశ‌మార్గంలో పార్కుల‌ను అభివృద్ధి చేయాల‌ని సూచించారు. అన్ని వయస్సుల వారూ త‌మ్మిడికుంట ప‌రిస‌రాల‌కు వ‌చ్చి సేద తీరే విధంగా ఏర్పాట్లు చేయాల‌న్నారు.

పిల్ల‌లకు ఆట‌విడిపుగా క్రీడా స్థ‌లాల‌ను తీర్చిదిద్దాలని రంగనాథ్ సూచించారు. వృద్ధులు కూర్చునేందుకు వీలుగా చుట్టూ సిమెంట్, రాతి కుర్చీలను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. అలాగే ఓపెన్ జిమ్‌లు, కొద్దిమంది కూర్చొని ప్ర‌శాంతంగా మాట్లాడుకోడానికి వీలుగా గుమ్మ‌టాలు ఏర్పాటు చేయాల‌న్నారు.


More Telugu News