అందెశ్రీ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందన

  • ప్రముఖ కవి అందె శ్రీ మృతిపై ప్రధాని మోదీ సంతాపం
  • ఆయన మరణం సాంస్కృతిక, మేధో ప్రపంచానికి తీరని లోటు అని వెల్లడి
  • అందె శ్రీ ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబించాయన్న ప్రధాని
  • ప్రజల పోరాటాలకు, ఆకాంక్షలకు గొంతుకగా నిలిచారని కితాబు
  • ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి ఉందని వ్యాఖ్య
  • వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి
ప్రముఖ కవి, జన వాగ్గేయకారుడు అందె శ్రీ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు అని అభివర్ణించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఆయన సంతాప సందేశాన్ని విడుదల చేసింది. అందె శ్రీ ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయని మోదీ కొనియాడారు.

"అందె శ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన, ప్రజల పోరాటాలకు, ఆకాంక్షలకు, అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ఏకం చేసే శక్తి, ప్రజల సాంఘిక హృదయస్పందనకి రూపం ఇచ్చే శక్తి ఉన్నాయి. ఆయన సామాజిక స్పృహను, సాహితీ సౌందర్యంతో మిళితం చేసిన విధానం అద్వితీయం. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి" అంటూ మోదీ తన ప్రకటనలో పేర్కొన్నారు.


More Telugu News