సీఎస్కేతో బంధం తెంచుకుంటున్నాడా?.. జడేజా ఇన్‌స్టాగ్రామ్ గల్లంతుపై సస్పెన్స్!

  • చెన్నై, రాజస్థాన్ మధ్య జడేజా ట్రేడింగ్ పై తీవ్ర చర్చలు
  • ఇంతలోనే అకస్మాత్తుగా మాయమైన జడేజా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్
  • ట్రేడింగ్ వదంతుల వల్లే ఇలా జరిగిందంటున్న ఫ్యాన్స్
  • తన ఐపీఎల్ కెరీర్‌ను రాజస్థాన్ రాయల్స్‌తోనే ప్రారంభించిన జ‌డ్డూ
  • 2012 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు కీలక ఆటగాడిగా ఆల్ రౌండ‌ర్‌
  • 2025 మెగా వేలానికి ముందు రూ.18 కోట్లకు జడేజాను రిటైన్ చేసుకున్న సీఎస్కే
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టును వీడనున్నాడా? ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. రాజస్థాన్ రాయల్స్‌తో జడేజా ట్రేడింగ్‌కు సంబంధించి తీవ్రమైన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అత‌ని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అకస్మాత్తుగా మాయం కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.

సోమవారం నుంచి జడేజా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ‘రాయల్‌నవఘన్’ కనిపించడం లేదు. నేరుగా బ్రౌజర్‌లో లింక్ ఓపెన్ చేసినా అది పనిచేయడం లేదు. అకౌంట్ ఎందుకు కనిపించడం లేదనే దానిపై స్పష్టత లేనప్పటికీ, ఐపీఎల్ భవిష్యత్తుపై నెలకొన్న సస్పెన్స్‌తోనే ఫ్యాన్స్ దీన్ని ముడిపెడుతున్నారు. జడేజానే స్వయంగా తన అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఆసక్తికరంగా జడేజా తన ఐపీఎల్ ప్రస్థానాన్ని 2008లో రాజస్థాన్ రాయల్స్‌తోనే ప్రారంభించాడు. 19 ఏళ్ల వయసులో ఆ జట్టుకు అరంగేట్రం చేసి, తొలి సీజన్‌లోనే టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. రెండు సీజన్ల తర్వాత, నిబంధనలకు విరుద్ధంగా ముంబై ఇండియన్స్‌తో నేరుగా ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలతో 2010లో ఐపీఎల్‌ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఆ తర్వాత కొచ్చి టస్కర్స్ తరఫున ఆడాడు.

2012లో చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరిన జడేజా, అప్పటి నుంచి ఆ జట్టులో అంతర్భాగంగా మారిపోయాడు. సీఎస్కే రెండు సంవత్సరాలు నిషేధానికి గురైన సమయం మినహా, దశాబ్దానికి పైగా జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. చెన్నై గెలిచిన ఐదు టైటిళ్లలో మూడింటిలో జడేజా పాత్ర ఉంది. 2022లో ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు జడేజానే జట్టును నడిపించాడు. అయితే, కెప్టెన్సీ భారం తన ప్రదర్శనపై, జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతుండటంతో మధ్యలోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.

2025 మెగా వేలానికి ముందు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తర్వాత రెండో ప్రాధాన్య ఆటగాడిగా జడేజాను రూ. 18 కోట్లకు సీఎస్కే రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో 254 మ్యాచ్‌లతో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఐదో ఆటగాడిగా ఉన్న జడేజా, సీఎస్కే తరఫున 143 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 2023 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చివరి ఓవర్లో అద్భుత ప్రదర్శనతో జట్టుకు టైటిల్ అందించడం అతని కెరీర్‌లో చిరస్మరణీయ క్షణం. ప్రస్తుతం ఈ ట్రేడింగ్ చర్చలు, ఇన్‌స్టాగ్రామ్ మిస్టరీతో జడేజా ఐపీఎల్ భవిష్యత్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


More Telugu News