డిజైనర్ సేఫ్టీ పిన్ ధర రూ.69 వేలు .. నెటిజన్ల విమర్శలు!

  • సాధారణ సేఫ్టీ పిన్‌ను రూ. 69,000కు అమ్ముతున్న ప్రాడా
  • క్రోచెట్ దారంతో చుట్టి, లోగోతో ప్రత్యేకంగా తయారీ
  • సాధారణ వస్తువుకు అంత ధరపై సోషల్ మీడియాలో ట్రోలింగ్
  • స్కూల్లో చేసుకునే వాళ్లం అంటూ నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు
  • గతంలో కోల్హాపురి చెప్పులను లక్షకు పైగా ధరకు అమ్మిన ప్రాడా
  • డిజైన్ కాపీపై అప్పట్లో కోర్టులో కేసు కూడా దాఖలు
ప్రముఖ ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ప్రాడా (Prada) మరోసారి వార్తల్లో నిలిచింది. మనం సాధారణంగా పది రూపాయలకు అనేక సేఫ్టీ పిన్‌లు కొంటుంటాం.  అయితే, ప్రాడా ఒక సేఫ్టీ పిన్ ను రూ. 69,000 (775 డాలర్లు) ధర ట్యాగ్‌తో అమ్ముతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సాధారణ వస్తువుకు ఇంత భారీ ధర పెట్టడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.

‘క్రోచెట్ సేఫ్టీ పిన్ బ్రూచ్’ పేరుతో ఈ యాక్సెసరీని ప్రాడా విక్రయిస్తోంది. ఇత్తడితో చేసిన ఈ సేఫ్టీ పిన్‌కు రంగురంగుల క్రోచెట్ దారాన్ని చుట్టి, దానిపై తమ సిగ్నేచర్ ట్రయాంగిల్ లోగోను జత చేసింది. ఈ బ్రూచ్ సుమారు 3.15 అంగుళాల పొడవు ఉంటుంది. నీలం-బ్రౌన్, పింక్-పిస్తా గ్రీన్, ఆరెంజ్-బ్రౌన్ వంటి మూడు రంగుల కాంబినేషన్లలో ఇది అందుబాటులో ఉంది.

సాధారణ వస్తువులను అత్యధిక ధరలకు అమ్మడం ప్రాడాకు కొత్తేమీ కాదు. గతంలో మహారాష్ట్రకు చెందిన సంప్రదాయ కోల్హాపురి చెప్పుల డిజైన్‌తో సాండల్స్‌ను తయారు చేసి, వాటిని ఏకంగా రూ. 1.2 లక్షలకు విక్రయించింది. స్థానిక కళాకారుల డిజైన్‌ను కాపీ కొట్టి, వారికి ఎలాంటి గుర్తింపు ఇవ్వకపోవడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) కూడా దాఖలైంది. భారతీయ చేతివృత్తుల వారికి నష్టపరిహారం చెల్లించాలని ఆ పిటిషన్‌లో డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ సేఫ్టీ పిన్ బ్రూచ్ వ్యవహారం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


More Telugu News