రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు... రోజుకి రూ.1 కోటి నష్టం

  •  హైదరాబాద్‌లో సైబర్ మోసాల మోత
  • 'జాగృత్ హైదరాబాద్ - సురక్షిత్ హైదరాబాద్' అవగాహన కార్యక్రమం ప్రారంభం
  • 'సైబర్ సింబా' లోగో, క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించిన పోలీసులు
  • మహిళలు, వృద్ధులే సైబర్ నేరగాళ్ల ప్రధాన లక్ష్యం అని డీజీపీ వెల్లడి
  • మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయాలని ప్రజలకు సూచన
  • స్వీయ అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట సాధ్యమని స్పష్టం
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల ఆశ, భయాన్ని ఆసరాగా చేసుకుని జరుపుతున్న మోసాల కారణంగా నగరవాసులు సగటున రోజుకు రూ.1 కోటి నష్టపోతున్నారని పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఈ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా పోలీసు శాఖ 'జాగృత్ హైదరాబాద్ – సురక్షిత్ హైదరాబాద్' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఆదివారం నాడు డీజీపీ బి. శివధర్ రెడ్డితో కలిసి కమిషనర్ సజ్జనార్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 'సైబర్ సింబా' లోగో, క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించి, వాలంటీర్లకు బ్యాడ్జీలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. గత దశాబ్ద కాలంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, ఇది ఇప్పుడు ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వీయ అవగాహనతోనే ఈ నేరాలను అరికట్టగలమని, అందుకే తెలంగాణ వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. "నేరగాళ్లు వ్యక్తుల సంపద, వయసు, చిరునామా వంటి వివరాలు సులభంగా సేకరించి ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఒంటరిగా ఉండే మహిళలు, వృద్ధులు, గృహిణులను లక్ష్యంగా చేసుకుని, వారిని భయపెట్టి డబ్బులు కాజేస్తున్నారు" అని ఆయన వివరించారు.

ప్రతి ఇంట్లో సైబర్ మోసాలపై అవగాహన ఉన్న ఒక్క 'సైబర్ సింబా' ఉన్నా, సమాజం మొత్తం సురక్షితంగా ఉంటుందని డీజీపీ అన్నారు. ఈ ఉద్యమంలో యువత, విశ్రాంత ఉద్యోగులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నేరాలను నిరోధించేందుకు 'సైబర్ పెట్రోలింగ్' కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ, అనుమానాస్పద కాల్స్, లింకులు, యాప్‌లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని, బలమైన పాస్‌వర్డ్‌లు వినియోగించాలని సలహా ఇచ్చారు. సైబర్ మోసాల బారిన పడిన బాధితులు తక్షణమే 1930 నంబర్‌కు కాల్ చేయాలని, లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. అనంతరం, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో సజ్జనార్ 'సైబర్ ప్రతిజ్ఞ' చేయించారు.


More Telugu News