మోదీ సభకు హాజరైతే అదనపు మార్కులంటూ యూనివర్సిటీ నోటీసు.. నిజమేంటంటే!

  • దేవ్ భూమి యూనివర్సిటీ లెటర్ హెడ్ తో సర్కులర్ సోషల్ మీడియాలో చక్కర్లు
  • ఈ ప్రచారాన్ని ఖండించిన కేంద్రం.. ఆ నోటీసు ఫేక్ అని తేల్చిన పీఐబీ
  • సోషల్ మీడియా ఖాతాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వర్సిటీ రిజిస్ట్రార్
ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేకంగా 50 అదనపు మార్కులు వేస్తామంటూ ఓ యూనివర్సిటీ జారీ చేసిన సర్కులర్ శనివారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరాఖండ్‌ లోని దేవ్‌ భూమి యూనివర్సిటీకి చెందిన ఈ నోటీసు సంచలనంగా మారింది. దీంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పందించి విచారణ చేసి ఆ సర్కులర్ ఫేక్ అని తేల్చింది. వివరాల్లోకి వెళితే..

దేవ్ భూమి యూనివర్సిటీలో ఆదివారం జరిగే ఓ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ ఓ సర్కులర్ జారీ చేసిందని, మోదీ సభకు హాజరైతే 50 మార్కులు అదనంగా వేస్తామని పేర్కొందని ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని భారతీయ జ్ఞాన పరంపర (భారతీయ జ్ఞాన వ్యవస్థ) కోర్సు కింద పరిగణిస్తామని నోటీసులో వర్సిటీ పేర్కొంది. వర్సిటీకి చెందిన అన్ని విభాగాల విద్యార్థులు తప్పకుండా హాజరు కావాలని కోరింది.

ఈ నోటీసు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటు వర్సిటీ, ఇటు కేంద్ర ప్రభుత్వం స్పందించాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నోటీసుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ నిర్వహించగా.. అది ఫేక్ అని తేలింది. అలాంటి నోటీసు ఏదీ జారీ చేయలేదని వర్సిటీ వివరణ ఇచ్చింది. సదరు నోటీసుపై సంబంధిత అధికారి సంతకం లేదని.. ఇటువంటి ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని కోరింది. తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలపై వర్సిటీ రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


More Telugu News