డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేస్తున్నారా? కొనుగోలుదారులకు సెబీ అలర్ట్

  • డిజిటల్ గోల్డ్ ఉత్పత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన
  • కొన్ని సందర్భాలలో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందన్న సెబీ
  • కొన్ని సంస్థలు సెబీ పరిధిలోకి రావని స్పష్టీకరణ
డిజిటల్ గోల్డ్ కొనుగోలుదారులకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక సూచన చేసింది. డిజిటల్ లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో లభించే బంగారం ఉత్పత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇన్వెస్టర్లకు సూచించింది.

బంగారంపై పెట్టుబడుల కోసం ఇటీవలి కాలంలో చాలామంది డిజిటల్ గోల్డ్‌పై ఆధారపడుతున్నారు. తమ మొబైల్ ఫోన్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో ఈ తరహా కొనుగోళ్లకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో సెబీ కీలక ప్రకటన చేసింది.

డిజిటల్ లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోలు చేయడం వల్ల కొన్ని సందర్భాలలో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఒక ప్రకటన విడుదల చేసింది.

కొన్ని డిజిటల్ లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు పెట్టుబడిదారులకు డిజిటల్ గోల్డ్ లేదా ఈ-గోల్డ్ ఉత్పత్తులను అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, భౌతిక బంగారంలో పెట్టుబడికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ గోల్డ్ ప్రాచుర్యం పొందిందని, అటువంటి డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు సెబీ నియంత్రణ పరిధిలోకి రావని తెలిపింది. ప్రస్తుత చట్టాల ప్రకారం అవి సెక్యూరిటీలు గానీ, కమోడిటీ డెరివేటివ్‌లు కానీ కావని, కాబట్టి వాటికి సెబీ నియంత్రణ వర్తించదని స్పష్టం చేసింది. అవి పూర్తిగా సెబీ వెలుపల పనిచేస్తాయని అన్నారు. అలాంటి ఉత్పత్తులకు సెక్యూరిటీల మార్కెట్ పరిధిలోకి పెట్టుబడిదారుల రక్షణ విధానాలు ఏవీ వర్తించవని తన ప్రకటనలో తెలిపింది.


More Telugu News