మాట నిలబెట్టుకున్న నాగబాబు.. అభిమాని కలను నెరవేర్చిన చిరంజీవి.. మెగా బ్రదర్స్‌పై ప్రశంసలు

  • తిరుపతి మురళికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాగబాబు
  • అభిమాని మురళిని చిరంజీవి వద్దకు తీసుకెళ్లిన వైనం
  • మెగాస్టార్‌ను చూసి భావోద్వేగానికి గురైన మురళి
  • తన సినిమాలో డ్యాన్స్ చేసే అవకాశం ఇస్తానన్న చిరంజీవి
  • మెగా బ్రదర్స్‌పై నెటిజన్ల ప్రశంసల వెల్లువ
మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని, తిరుపతికి చెందిన మురళి కల నిజమైంది. కొన్ని రోజుల క్రితం ‘ఢీ’ డ్యాన్స్ షో వేదికపై మురళికి ఇచ్చిన మాటను మెగా బ్రదర్ నాగబాబు నిలబెట్టుకున్నారు. ఆయన్ను స్వయంగా చిరంజీవి వద్దకు తీసుకెళ్లి, క‌ల‌వాల‌న్న కలను నెరవేర్చారు. ఈ సందర్భంగా చిరంజీవి తన అభిమానికి జీవితాంతం గుర్తుండిపోయే ఓ బంపరాఫర్ ఇచ్చారు. తన సినిమాలో తన పక్కన డ్యాన్స్ చేసే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చి మురళి ఆనందాన్ని రెట్టింపు చేశారు.

వివరాల్లోకి వెళితే.. చిరంజీవి పాటలకు అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ తిరుపతికి చెందిన మురళి సోషల్ మీడియాలో స్టార్‌గా మారారు. ఆయన వీడియోలు వైరల్ కావడంతో ‘ఢీ’ షోలో ప్రదర్శన ఇచ్చే అవకాశం దక్కించుకున్నారు. దీపావళి ప్రత్యేక ఎపిసోడ్‌కు గెస్ట్‌గా వచ్చిన నాగబాబు, మురళి డ్యాన్స్ చూసి ఫిదా అయ్యారు. "నిన్ను చిరంజీవి గారికి కచ్చితంగా కలుపుతా" అని అప్పుడే మాట ఇచ్చారు.

తాజాగా ఇచ్చిన మాట ప్రకారం, నాగబాబు స్వయంగా మురళిని చిరంజీవి షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి తీసుకెళ్లారు. తన ఆరాధ్య దైవాన్ని కళ్లెదుట చూసిన మురళి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “మీరు లేనిదే నేను లేను సర్… ఇక చనిపోయినా పర్లేదు” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మురళి అభిమానాన్ని చూసి చలించిన చిరంజీవి, ఆయన్ను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. అంతేకాకుండా, "ఒక రోజు నా సినిమాలో నా పక్కన డ్యాన్స్ చేస్తావు" అని హామీ ఇవ్వడంతో మురళి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒక సాధారణ అభిమాని కలను నెరవేర్చిన నాగబాబును, ఆ అభిమానికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన చిరంజీవిని నెటిజన్లు, మెగా ఫ్యాన్స్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే, చిరంజీవి నటిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం సంక్రాంతికి, 'విశ్వంభర' వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.



More Telugu News