అమెరికా వీసాపై కొత్త రూల్స్.. ఇకపై ఈ ఆరోగ్య సమస్యలుంటే కష్టమే!

  • అమెరికా వీసా కోసం ఆరోగ్య నిబంధనలను కఠినతరం చేసిన యూఎస్
  • మధుమేహం, ఊబకాయం ఉన్నవారికి వీసా పొందడం ఇకపై కష్టం
  • గుండె జబ్బులు, శ్వాస సమస్యలనూ పరిశీలన జాబితాలో చేర్చిన ప్రభుత్వం
  • దేశంపై ఆర్థిక భారం పడకుండా నివారించేందుకే ఈ కొత్త మార్గదర్శకాలు
  • చికిత్స ఖర్చులు భరించగలమని నిరూపిస్తే వీసా మంజూరుకు అవకాశం
అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇది కీలకమైన సమాచారం. మధుమేహం (షుగర్), ఊబకాయం (ఒబేసిటీ) వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇకపై అమెరికా వీసా లభించడం కష్టతరం కానుంది. విదేశీయులకు వీసాలు జారీ చేసే ప్రక్రియలో భాగంగా ఆరోగ్య పరిశీలన నిబంధనలను ఆ దేశ విదేశాంగ శాఖ తాజాగా సవరించింది. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఎంబసీలు, కాన్సులేట్లకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.

కొత్త నిబంధనల ప్రకారం.. వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఆరోగ్య పరిస్థితిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇప్పటివరకు ఉన్న జాబితాకు అదనంగా మధుమేహం, ఊబకాయం సమస్యలను కూడా చేర్చారు. వీటితో పాటు గుండె జబ్బులు, తీవ్రమైన శ్వాస సమస్యలు, క్యాన్సర్, నాడీ సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారి దరఖాస్తులను కూడా నిశితంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు అమెరికాలోకి ప్రవేశిస్తే, వారి చికిత్స ఖర్చులు ప్రభుత్వానికి భారంగా మారతాయని అధికారులు భావిస్తున్నారు.

అమెరికా ప్రభుత్వ ప్రయోజనాలపై ఆధారపడాల్సి వస్తుందని భావించే వారికి వీసా నిరాకరించే అధికారం అధికారులకు ఉంటుంది. ఇప్పటికే ఒబేసిటీ సమస్యతో సతమతమవుతున్న అమెరికా, తమ దేశంపై మరింత ఆర్థిక భారం పడకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే, దరఖాస్తుదారులు తమ ఆరోగ్య సంరక్షణ, చికిత్స ఖర్చులను పూర్తిగా తామే భరించగలమని, అందుకు తగినంత ఆర్థిక స్థోమత ఉందని రుజువు చేసుకోగలిగితే వారికి వీసా మంజూరు చేసే విషయాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తుదారులతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబసభ్యుల (డిపెండెంట్లు) ఆరోగ్య పరిస్థితి, వారికి ఏవైనా తీవ్ర వ్యాధులు లేదా వైకల్యాలు ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తారు. ఈ కొత్త నిబంధనల వల్ల వృద్ధులకు కూడా వీసా రావడం కష్టమవుతుందని, అమెరికాలోకి వలసలను నిరుత్సాహపరిచేందుకే ఈ మార్గదర్శకాలను విస్తృతం చేశారని ఇమిగ్రేషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


More Telugu News