సీబీఐ కోర్టుకు జగన్ కీలక వినతి

  • అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేసిన జగన్
  • వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి
  • తన భద్రతా ఏర్పాట్లు ప్రభుత్వ యంత్రాంగానికి భారమని పేర్కొన్న మాజీ సీఎం
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమని వెల్లడి
  • న్యాయస్థానం ఆదేశిస్తే వ్యక్తిగతంగా వస్తానని కూడా స్పష్టం చేసిన జగన్
  • ఈ నెల 14 లోపు హాజరు కావాలని గతంలో ఆదేశించిన కోర్టు
అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. యూరప్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఈ నెల 14వ తేదీలోగా వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని గతంలో న్యాయస్థానం ఆదేశించిన విషయం విదితమే. ఈ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన తన న్యాయవాది ద్వారా ఈ మెమోను దాఖలు చేశారు.

తాను కోర్టుకు హాజరయ్యే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తనకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని, ఇది ప్రభుత్వానికి అదనపు భారంగా మారుతుందని జగన్ తన మెమోలో పేర్కొన్నారు. ఈ కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరారు. ఒకవేళ న్యాయస్థానం అనుమతిస్తే, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రతిపాదించారు.

అయితే, విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావడం తప్పనిసరి అని కోర్టు భావిస్తే.. న్యాయస్థానం ఆదేశాలను శిరసావహించి హాజరవుతానని కూడా జగన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం జగన్ దాఖలు చేసిన ఈ మెమోపై సీబీఐ కోర్టు తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 


More Telugu News