పవన్ కల్యాణ్ చొరవతో ఓ కుగ్రామానికి విద్యుత్ సరఫరా

  • అల్లూరి జిల్లా గూడెం గ్రామానికి తొలిసారి విద్యుత్ సరఫరా
  • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో సాకారమైన దశాబ్దాల కల
  • 17 ఆవాసాలకు 9.6 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో విద్యుత్ లైన్లు
  • గిరిజన గ్రామాల్లో మొట్టమొదటి హైబ్రిడ్ సోలార్, పవన విద్యుత్ కేంద్రం ఏర్పాటు
  • తమ ఇళ్లలో వెలుగులు నింపిన పవన్‌కు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్థులు
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఓ మారుమూల గిరిజన గూడెంలో దశాబ్దాల చీకట్లు తొలిగిపోయాయి. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, కనీస వసతులు కరువై కాలం వెళ్లదీస్తున్న 'గూడెం' గ్రామం తొలిసారి విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చూపిన చొరవ, కేంద్ర ప్రభుత్వం, అధికారుల కృషితో తమ చిరకాల స్వప్నం నెరవేరిందని గిరిపుత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
 
అనంతగిరి మండల కేంద్రానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో, రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 17 ఆవాసాలతో గూడెం గ్రామం ఉంది. ఇక్కడి గిరిజనులకు సరైన రహదారి, రక్షిత తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు లేవు. పగటిపూట ఉపాధి కోసం అడవిబాట పట్టినా, రాత్రయితే బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి వారిది. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం తమ గోడును ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు విన్నవించుకున్నారు. వారి సమస్యపై తక్షణమే స్పందించిన ఆయన, గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
 
పవన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ అధికారులు, 17 ఆవాసాలకు విద్యుత్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దట్టమైన అడవులు, కొండల గుండా 9.6 కిలోమీటర్ల పొడవునా విద్యుత్ లైన్లు వేయాల్సి ఉంటుందని, దీనికి రూ.80 లక్షలకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని 'నాన్ పీవీజీటీ' పథకం ద్వారా నిధులు సమకూర్చి పనులు పూర్తి చేశారు.
 
ఇక్కడితో ఆగకుండా, ప్రత్యామ్నాయ చర్యగా 'పీఎం జన్మన్' పథకం కింద రూ.10.22 లక్షలతో సోలార్, పవన విద్యుత్‌తో పనిచేసే హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. గిరిజన గ్రామాల్లో ఈ తరహా గ్రిడ్ వ్యవస్థను నెలకొల్పడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ప్రాజెక్టు కింద ప్రభుత్వం ప్రతి ఇంటికీ ఐదు బల్బులు, ఒక ఫ్యాన్‌ను కూడా అందించింది.
 
తమ గ్రామంలో విద్యుత్ వెలుగులు చూడటంతో గూడెం ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ ఇళ్లలో కాంతులు నింపిన పవన్ కల్యాణ్‌కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చారిత్రక సందర్భంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, అరకు జనసేన నేతలు, జనసైనికులు కనీస రహదారి సౌకర్యం లేని ఆ గిరి శిఖర గ్రామానికి చేరుకుని, గిరిజనుల ఆనందంలో పాలుపంచుకున్నారు.


More Telugu News