బ్యాలెట్‌పై నేను లేను, అందుకే ఓడిపోయాం: సొంత పార్టీ ఓటమిపై డొనాల్డ్ ట్రంప్

  • అమెరికా కీలక ఎన్నికల్లో డెమోక్రాట్ల ఘన విజయం
  • రిపబ్లికన్ల ఓటమికి కారణం తాను బ్యాలెట్‌పై లేకపోవడమేనన్న ట్రంప్
  • ప్రభుత్వ షట్‌డౌన్ కూడా ఓటమికి మరో కారణమని వ్యాఖ్య
అమెరికాలో జరిగిన కీలక ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ విజయదుందుభి మోగించింది. జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన ఈ మొదటి ప్రధాన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే, ఈ ఓటమిపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. రిపబ్లికన్ల ఓటమికి గల కారణాలను ఆయన విశ్లేషించారు. తాను బ్యాలెట్‌పై లేకపోవడం, ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావమే ఓటమికి దారితీశాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ ఫలితాలపై ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో స్పందిస్తూ, "ట్రంప్ బ్యాలెట్‌పై లేరు, ప్రభుత్వ షట్‌డౌన్.. ఈ రాత్రి ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓడిపోవడానికి ఈ రెండే కారణాలని పోల్‌స్టర్స్ చెబుతున్నారు" అని పోస్ట్ చేశారు.

ఎన్నికలకు ముందు కూడా ట్రంప్ డెమోక్రాట్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "డెమోక్రాట్లకు వేసే ఓటు మరణశాసనమే. రిపబ్లికన్లకు ఓటేయండి" అని ఆయన పిలుపునిచ్చారు. వర్జీనియా, న్యూజెర్సీ ఓటర్లను ఉద్దేశించి, రిపబ్లికన్లకు ఓటేస్తే ఇంధన ధరలు భారీగా తగ్గుతాయని, అదే డెమోక్రాట్లకు వేస్తే ధరలు రెట్టింపు, మూడింతలు, నాలుగు రెట్లు కూడా అవుతాయని హెచ్చరించారు.

ముఖ్యంగా న్యూయార్క్ నగర మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. మమ్దానీ గెలిస్తే న్యూయార్క్ నగరానికి ఫెడరల్ నిధులు నిలిపివేస్తామని సోమవారం హెచ్చరించారు. "అనుభవం లేని కమ్యూనిస్ట్ అయిన మమ్దానీ గెలవడం కంటే, విజయవంతమైన రికార్డు ఉన్న డెమోక్రాట్ గెలవడమే మేలు" అని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే, ట్రంప్ హెచ్చరికలను, అంచనాలను తలకిందులు చేస్తూ జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. శతాబ్ద కాలంలో నగరానికి అత్యంత పిన్న వయస్కుడైన మేయర్‌గా ఆయన జనవరి 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. మరోవైపు, ఎన్నికల ఫలితాల అనంతరం ‘ట్రంప్ మీ అధ్యక్షుడు’ అంటూ వైట్‌హౌస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.


More Telugu News