మెట్రో రైలు నుంచి వృద్ధుడిని తోసేసిన యువకుల అరెస్టు

  • గత నెల 21వ తేదీన ఘటన
  • సీనియర్ సిటిజన్ సీటులో కూర్చున్న యువకులను ఖాళీ చేయమని కోరిన వృద్ధుడు
  • ఆగ్రహంతో లక్డీకాపూల్ స్టేషన్ రాగానే బయటకు తోసేసిన యువకులు
హైదరాబాద్ మెట్రో రైలు నుంచి వృద్ధుడిని తోసివేసిన యువకులను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం, ఒక వృద్ధుడు గత నెల 21న అమీర్‌పేటలో మెట్రో రైలు ఎక్కాడు. సీనియర్ సిటిజన్ సీటులో కూర్చున్న యువకులను ఖాళీ చేయమని కోరాడు. దీనితో ఆగ్రహానికి గురైన యువకులు ఆ వృద్ధుడిని అసభ్య పదజాలంతో దూషించి, అతడిపై దాడికి దిగారు.

లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ రాగానే వారు ఆ వృద్ధుడిని రైలు నుంచి తోసివేశారు. గాయపడిన బాధితుడు ఈ ఘటనపై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిజాంపేటకు చెందిన సివ్వాల సునీల్, అశోక్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురంకు చెందిన రాజేశ్‌లను అరెస్టు చేశారు.


More Telugu News