అభిషేక్ శర్మ సంగతి మా పేసర్లు చూసుకుంటారు: ఆసీస్ స్పిన్నర్ కునెమన్

  • టీమిండియా-ఆసీస్ మధ్య గురువారం నాడు నాలుగో టీ20
  • గోల్డ్ కోస్ట్ లో మ్యాచ్
  • సొంత మైదానంలో ఆడుతున్న ఆసీస్ స్పిన్నర్ కునెమన్
  • అభిషేక్ శర్మను త్వరగా అవుట్ చేస్తేనే మ్యాచ్ పై పట్టు సాధించగలమని వెల్లడి
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, అయితే అతడిని కట్టడి చేసే సత్తా తమ పేసర్లకు ఉందని ఆస్ట్రేలియా స్పిన్నర్ మ్యాట్ కునెమన్ ధీమా వ్యక్తం చేశాడు. గురువారం గోల్డ్ కోస్ట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో, కునెమన్ మీడియాతో మాట్లాడాడు. అభిషేక్‌ను ‘సీరియస్ టాలెంట్’గా అభివర్ణించిన కునెమన్, అతడి వికెట్‌ను త్వరగా తీయడం తమకు ఎంతో కీలకమని అభిప్రాయపడ్డాడు.

"మా పేసర్లు జేవియర్ బార్ట్‌లెట్ లేదా బెన్ డ్వార్షుయిస్ తొలి రెండు ఓవర్లలోనే అతని వికెట్ తీస్తారని ఆశిస్తున్నా. అతను అద్భుతమైన ప్రతిభావంతుడు. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడతాడు. అతడిని త్వరగా ఔట్ చేస్తేనే మేం మ్యాచ్‌పై పట్టు సాధించగలం" అని కునెమన్ వివరించాడు. భారత బ్యాటింగ్ లైనప్‌ను నిలువరించాలంటే ఆరంభంలోనే వికెట్లు తీయడం ముఖ్యమని అన్నాడు.

గోల్డ్ కోస్ట్ స్టేడియంలో టీమిండియా అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం ఇదే తొలిసారి. సొంత మైదానంలో ఆడనుండటంపై కునెమన్ సంతోషం వ్యక్తం చేశాడు. "ఇక్కడ ఆడటాన్ని నేను ఎంతో ఇష్టపడతాను. నా కుటుంబసభ్యులు, స్నేహితులను కలవడం ఆనందంగా ఉంది. ఈ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది" అని అంచనా వేశాడు.

ఈ మైదానం ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ లీగ్ (AFL) కోసం నిర్మించారని, దాని ఆకారం చాలా విభిన్నంగా ఉంటుందని కునెమన్ తెలిపాడు. "ఇది చాలా విచిత్రమైన ఆకారం ఉన్న గ్రౌండ్. ఇక్కడ పరుగులు బాగా రావచ్చు, అలాగే బౌలర్లకు దెబ్బలు కూడా పడొచ్చు. కొన్ని చోట్ల బౌండరీలు పెద్దగా, మరికొన్ని చోట్ల చిన్నగా ఉంటాయి. ఈ మైదానంలో మాక్స్‌వెల్‌కు మంచి రికార్డు ఉంది. అతని సలహాలు తీసుకుంటాను" అని పేర్కొన్నాడు.

ప్రస్తుతం ఐపీఎల్ వేలంపై చర్చ జరుగుతున్నప్పటికీ, తన దృష్టి మొత్తం ఆస్ట్రేలియాకు ఆడటంపైనే ఉందని కునెమన్ స్పష్టం చేశాడు. "ఐపీఎల్‌లో ఆడాలని ఎవరికైనా ఉంటుంది. కానీ ఒక స్పిన్నర్‌గా అవకాశం దక్కించుకోవడం చాలా కష్టం. అందుకే దాని గురించి ఎక్కువగా ఆలోచించను. నా ప్రాధాన్యత ఆస్ట్రేలియాకు ఆడటానికే" అని కునెమన్ తేల్చి చెప్పాడు.


More Telugu News