కొత్త పార్టీ ప్రకటించబోతున్నారనే ప్రచారంపై కవిత స్పందన

  • కొత్త పార్టీ ఏర్పాటు వార్తలను ఖండించిన కవిత
  • పత్తి రైతుల కష్టాలపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నిర్లక్ష్యంగా ఉన్నాయని విమర్శ
  • రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ హామీలు అమలు కాలేదు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ అంశంపై స్పందించారు. మార్చి-ఏప్రిల్‌లో కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారాన్ని కవిత ఖండించారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను చేపట్టిన 'జాగృతి జనం బాట' కార్యక్రమం ఏప్రిల్ 13న ముగుస్తుందని తెలిపారు. ఇది రాజకీయ ఎజెండా కాదని, ప్రజల సమస్యలను తెలుసుకుని సంస్థను బలోపేతం చేయడమే లక్ష్యమని వివరించారు. ఈ నాలుగు నెలల పాటు ప్రజలతోనే ఉంటానని, పాత, కొత్త కార్యకర్తలు తమతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నారని కవిత పేర్కొన్నారు. 

అదే సమయంలో, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి పత్తి రైతుల సమస్యల కన్నా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదే ఎక్కువ శ్రద్ధ ఉందని ఆమె ఆరోపించారు. ఆదిలాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడని ఆవేదన వ్యక్తం చేశారు.

మొంథా తుపాను కారణంగా పత్తిలో తేమ శాతం పెరిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కవిత తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పత్తిలో తేమ శాతాన్ని 20-25 శాతం వరకు అనుమతించాలని కేంద్ర మంత్రిని కోరనున్నట్లు వెల్లడించారు. "జూబ్లీహిల్స్‌లో రైతులు ఉంటే మా కష్టాలు తీరేవి" అని రైతులు వాపోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరంగల్‌లో రైతు డిక్లరేషన్ ప్రకటించి మాటలు చెప్పారే తప్ప, ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని కవిత ఆరోపించారు. ఈఎంఐల రూపంలో చెల్లిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు పట్టించుకోకపోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని అన్నారు. ఈ విషయంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తలపెట్టిన బంద్‌కు తెలంగాణ జాగృతి పూర్తి మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు.




More Telugu News