టీఇండియా గెలుపును సెలెబ్రేట్ చేసుకున్న పాకిస్థాన్ ఫ్యామిలీ... వీడియో వైరల్

  • మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమిండియా
  • భారత్ విజయంపై పాకిస్థాన్‌లో ఓ కుటుంబం సంబరాలు
  • టీమిండియా ఫొటోతో కేక్ కట్ చేసిన పాక్ ఫ్యాన్స్
  • కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఫొటోకు కేక్ తినిపిస్తున్న వీడియో వైరల్
  • ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగులతో ఓడించిన భారత్
భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రక విజయాన్ని భారత్‌తో పాటు పొరుగుదేశం పాకిస్థాన్‌లోనూ సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టీమిండియా విజయాన్ని అభినందిస్తూ పాక్‌కు చెందిన ఓ కుటుంబం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పాకిస్థాన్‌కు చెందిన ఓ కుటుంబం, భారత జట్టు విజయాన్ని తమ ఇంట్లో ఘనంగా జరుపుకుంది. వారంతా పాకిస్థాన్ జెర్సీలు ధరించి ఉండటం విశేషం. టీమిండియా క్రీడాకారిణుల ఫొటో ఉన్న కేక్‌ను కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. “మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమిండియాకు అభినందనలు. భారత జట్టుకు పాకిస్థాన్ నుంచి ప్రేమ, మద్దతు” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

 arshadmuhammadhanif అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోలు పోస్ట్ అయ్యాయి. ఇదే ఖాతాలో పోస్ట్ చేసిన మరో వీడియోలో, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫొటోను టీవీలో చూపిస్తూ.. కొందరు చిన్నారులు, ఓ వ్యక్తి ఆమెకు కేక్ తినిపిస్తున్నట్లుగా ఉన్న దృశ్యాలు కట్టిపడేశాయి. ఈ వీడియోలపై భారత నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తూ, ధన్యవాదాలు తెలుపుతున్నారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌ను భారత్ తొలిసారిగా కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో హర్మన్‌ప్రీత్ సేన ఘన విజయం సాధించింది. దీంతో 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గతంలో మిథాలీ రాజ్ కెప్టెన్సీలో రెండుసార్లు ఫైనల్ చేరినా, భారత్‌కు నిరాశే ఎదురైంది. కానీ ఈసారి మాత్రం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి కప్‌ను ముద్దాడింది.

ఈ మెగా టోర్నీ విజయంతో భారత మహిళల జట్టుకు రూ.39 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. దీనికి అదనంగా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా రూ.51 కోట్ల భారీ నజరానాను ప్రకటించి క్రీడాకారిణులను అభినందించింది. 


More Telugu News