జోగి రమేశ్ కస్టడీ కోసం ఎక్సైజ్ అధికారుల పిటిషన్... విచారణ రేపటికి వాయిదా

  • నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్‌ అరెస్ట్ 
  • నవంబరు 13 వరకు రిమాండ్
  • కస్టడీకి కోరిన ఎక్సైజ్ శాఖ
  • జోగి రమేశ్, ఆయన సోదరుడిని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్
  • కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు.. విచారణ మంగళవారానికి వాయిదా
నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ ఎక్సైజ్ శాఖ అధికారులు కోర్టును ఆశ్రయించారు. జోగి రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రామును 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

నిన్న ఆదివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సిట్ అధికారులు జోగి రమేశ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన్ను, ఆయన సోదరుడు రామును తూర్పు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో దాదాపు 12 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, వారికి నవంబర్ 13 వరకు రిమాండ్ విధించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన జనార్దనరావుతో వారికి ఉన్న సంబంధాలపై అధికారులు లోతుగా ఆరా తీశారు. రిమాండ్ విధించడంతో జోగి సోదరులను విజయవాడ జైలు నుంచి నెల్లూరు జైలుకు తరలించారు. కేసులో మరింత లోతైన దర్యాప్తు కోసం వారిని కస్టడీకి తీసుకోవడం అత్యవసరమని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది.

ఇదే కేసులో అద్దేపల్లి సోదరులను రెండోసారి కస్టడీకి కోరుతూ ఎక్సైజ్ శాఖ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై విచారణ నవంబర్ 6న జరగనుంది. జోగి రమేశ్ కస్టడీ పిటిషన్‌పై మంగళవారం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


More Telugu News