జోగి రమేశ్‌కు సహకరిస్తే పోలీసులపైనా చర్యలు: మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరిక

  • కల్తీ మద్యం కేసులో జోగి రమేశ్‌ను ఆధారాలతోనే అరెస్ట్ చేశామన్న కొల్లు
  • ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే నకిలీ మద్యం తయారీ చేశారని ఆరోపణ
  • జోగి రమేశ్, జనార్దనరావు మధ్య సంబంధాలు బహిరంగమేనని వ్యాఖ్య
కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేశ్‌ను పూర్తి ఆధారాలతోనే పోలీసులు అరెస్టు చేశారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే జోగి రమేశ్ నకిలీ మద్యం తయారు చేయించారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో అన్ని ఆధారాలూ సేకరించిన తర్వాతే చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.

మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం మీడియాతో మాట్లాడుతూ... జోగి రమేశ్‌కు, మరో నిందితుడైన జనార్దనరావుకు మధ్య ఉన్న సంబంధం అందరికీ తెలిసిందేనని అన్నారు. జనార్ధనరావు నేరుగా జోగి రమేశ్ ఇంటికి వెళ్లినట్లు నిర్ధారించే సీసీటీవీ ఫుటేజ్ కూడా తమ వద్ద ఉందని ఆయన వెల్లడించారు. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత జోగి రమేశ్‌కు ఏమాత్రం లేదని విమర్శించారు.

ఈ కేసు దర్యాప్తు విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని మంత్రి హెచ్చరించారు. ఒకవేళ పోలీసు శాఖలో ఎవరైనా అధికారులు ఉద్దేశపూర్వకంగా జోగి రమేశ్‌కు అనుకూలంగా వ్యవహరించినా, కేసును తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుందని, దోషులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.


More Telugu News