చేవెళ్ల బస్సు ప్రమాదం జరిగిన చోట.. ఎమ్మెల్యేపై దాడికి యత్నం!

  • రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
  • బస్సు ప్రమాదం జరిగిన చోటుకు వచ్చిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
  • ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు బస్సు ప్రమాద స్థలిలో చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి 163పై రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సుపై కంకర లోడుతో వెళుతున్న లారీ పడిపోవడంతో 19 మంది ప్రయాణీకులు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.

ఈ ప్రాంతానికి కాలే యాదయ్య రాగా, ప్రయాణికులు 'ఎమ్మెల్యే డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేస్తూ, ఆయనపై దాడికి యత్నించారు. వారి నిరసనతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ ప్రమాదం చాలా బాధాకరమని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రహదారి మంజూరై ఆరేడు సంవత్సరాలు అవుతోందని తెలిపారు. ఈ రోడ్డు చాలా చిన్నగా ఉందని, ఈ ప్రాంతంలో ఎన్నోమార్లు ప్రమాదాలు జరిగాయని అన్నారు. రోడ్డు సన్నగా ఉండటం వల్ల వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్జీటీలో కేసుల వేసిన కారణంగా రోడ్డు వెడల్పు ఆలస్యమవుతోందని అన్నారు.

టిప్పర్ వేగంగా వచ్చి ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిందని తాండూరు బస్ డిపో మేనేజర్ తెలిపారు. ఉదయం 7.05 గంటలకు ప్రమాదం జరిగిందని, టిప్పర్‌లో సుమార్ 50 టన్నుల కంకర ఉన్నట్లు వెల్లడించారు. గుంతను తప్పించబోయి టిప్పర్ బస్సును ఢీకొన్నట్లు తెలిసిందని తెలిపారు.


More Telugu News