ప్రపంచకప్ వేదికపై భావోద్వేగం.. జై షా కాళ్లకు నమస్కరించబోయిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్!

  • మహిళల వన్డే ప్రపంచకప్ 2025 గెలిచిన భారత జట్టు
  • ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం
  • ట్రోఫీ అందుకుంటూ భావోద్వేగానికి గురైన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్
  • ఐసీసీ ఛైర్మన్ జై షా కాళ్లకు నమస్కరించబోయిన హర్మన్
  • ఆమెను గౌరవంతో వారించిన జై షా
భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. కోట్లాది అభిమానుల కలలను సాకారం చేస్తూ వన్డే ప్రపంచకప్ 2025ను ముద్దాడింది. నిన్న జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత ట్రోఫీ ప్రజెంటేషన్ వేదికపై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ భావోద్వేగానికి గురైంది. ఐసీసీ ఛైర్మన్ జై షా చేతుల మీదుగా ట్రోఫీ అందుకునే క్రమంలో, ఆమె గౌరవంతో ఆయన కాళ్లకు నమస్కరించబోగా, జై షా ఆమెను సున్నితంగా వారించారు. ఈ దృశ్యం అందరినీ కదిలించింది.

టోర్నమెంట్ ఆరంభంలో వరుసగా మూడు ఓటములు ఎదురవడంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వ పటిమపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే, వాటన్నింటికీ నాకౌట్ దశలో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో, వ్యూహాత్మక కెప్టెన్సీతో ఆమె సమాధానం చెప్పింది. సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. మహిళల క్రికెట్‌లో బీసీసీఐ కార్యదర్శిగా జై షా చేసిన సంస్కరణలు, ముఖ్యంగా పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజులు అమలు చేయడం వంటి నిర్ణయాల పట్ల కృతజ్ఞతతోనే హర్మన్‌ప్రీత్ ఆయన కాళ్లకు నమస్కరించే ప్రయత్నం చేసింది.

మ్యాచ్ అనంతరం హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ "లీగ్ దశలో ఇంగ్లండ్‌తో జరిగిన ఓటమి మాలో చాలా మార్పు తీసుకొచ్చింది. ఆ రాత్రి తర్వాత మేమంతా దృఢ సంకల్పంతో బరిలోకి దిగాం. విజువలైజేషన్, మెడిటేషన్ వంటివి సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టాం. ఇది జట్టులో ప్రతి ఒక్కరిపై సానుకూల ప్రభావం చూపింది. మేమంతా ఒక లక్ష్యం కోసం ఇక్కడికి వచ్చామని, ఈసారి కప్ గెలవాల్సిందేనని నిర్ణయించుకున్నాం" అని తెలిపారు.

ఈ క్షణం కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నామని, రాత్రంతా సంబరాలు జరుపుకుంటామని ఆమె ఆనందంగా చెప్పింది. "ఇది ఆరంభం మాత్రమే, మా ప్రయాణం ఇక్కడితో ఆగదు" అంటూ భవిష్యత్ విజయాలపై ధీమా వ్యక్తం చేసింది.


More Telugu News