లండన్ లో రేపు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ... వివరాలు ఇవిగో!

  • వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్లిన సీఎం చంద్రబాబు
  • అయినప్పటికీ పెట్టుబడుల కోసం ప్రయత్నాలు
  • విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్న సీఎం
వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు, తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి ఆదివారం లండన్ చేరుకున్నారు. ఈ నెల 4వ తేదీన ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ నారా భువనేశ్వరికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) సంస్థ రెండు అవార్డులు అందించనుంది. ఈ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు లండన్ లో పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా భేటీ కానున్నారు.

విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరుగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు అక్కడి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించనున్నారు. దీనికి సంబంధించి సోమవారం వివిధ పరిశ్రమలు, సంస్థలకు చెందిన ప్రతినిధులను కలవనున్నారు. అక్టోపస్ ఎనర్జీ గ్రూప్ డైరెక్టర్ క్రిస్ ఫ్రిట్జ్ గెరాల్డ్, హిందూజాకు చెందిన వివిధ సంస్థల ఛైర్మన్లు అశోక్ హిందూజా, ప్రకాశ్ హిందూజా, షోమ్ హిందూజాలతో సీఎం భేటీ కానున్నారు. 

ఇక రోల్స్ రాయిస్ గ్రూప్ చీఫ్ ట్రాన్సఫర్మేషన్ ఆఫీసర్ నిక్కీ-గ్రాడీ స్మిత్, శ్రామ్ అండ్ మ్రామ్ సంస్థ ఛైర్మన్ శైలేష్ హీరానందాని, శ్యామ్ కో హోల్డింగ్స్ ఛైర్మన్ సంపత్ కుమార్, ఆ సంస్థ సీఈఓ, డైరెక్టర్లు వైద్యనాథన్, అశ్వినీ సంపత్ కుమార్ లతో పాటు కొసరాజు గిరిబాబు వంటి వారితో సీఎం వరుస సమావేశాల్లో పాల్గొనున్నారు. 

మరోవైపు వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు ముగిసిన తర్వాత వివిధ పారిశ్రామిక వేత్తలతో సీఐఐ నేతృత్వంలో జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బ్రిటిష్ హెల్త్ టెక్ ఇండస్ట్రీ, ఏఐ పాలసీ ల్యాబ్, అరూప్, ఏథెనియన్ టెక్, ఫిడో టెక్, పీజీ పేపర్ కంపెనీ, నేషనల్ గ్రాఫెనీ ఇన్సిటిట్యూట్, వార్విక్ మాన్యుఫాక్చరింగ్ వంటి సంస్థలకు చెందిన ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే లండన్ లోని ఇండియన్ హైకమిషనర్ దొరైస్వామితో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఏయే రంగాల్లో ఏయే రకాల పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయనే అంశాన్ని దొరైస్వామితో జరపనున్న భేటీలో ముఖ్యమంత్రి వివరించనున్నారు


More Telugu News