దమ్ముంటే ఆ పథకం ఆపండి... సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్

  • కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు
  • దమ్ముంటే సన్నబియ్యం పథకం ఆపి చూడాలని సీఎంకు సవాల్
  • సన్నబియ్యం పథకం కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం
  • మజ్లిస్ ఓట్ల కోసమే బీజేపీపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం
  • ఓటర్లను బెదిరిస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
  • రాష్ట్రానిది కేవలం ఉచిత బస్సు పథకం మాత్రమేనని వ్యాఖ్య
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సన్నబియ్యం పథకాన్ని ఆపేస్తామని ముఖ్యమంత్రి ప్రజలను భయపెడుతున్నారని, దమ్ముంటే ఆ పథకాన్ని ఆపి చూడాలని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. "సన్నబియ్యం పథకం కాంగ్రెస్‌ది కాదు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఉచిత బియ్యం పథకంలో భాగం. ఈ పథకంలో కేంద్రం కిలో బియ్యానికి రూ.42 భరిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది కేవలం రూ.15 మాత్రమే. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి, పథకాన్ని ఆపేస్తామని బెదిరించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే" అని స్పష్టం చేశారు. ఓటు వేయకపోతే పథకాలు ఆపేస్తామని బెదిరించడంపై ఇప్పటికే బీజేపీ తరఫున ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మజ్లిస్ ఓట్లను దక్కించుకోవడానికే కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విమర్శలు చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా అమలు చేస్తున్న ఏకైక పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ప్రజలను బెదిరించేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కిషన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో ఉప ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది.


More Telugu News