హైదరాబాద్‌కు రానున్న ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ

  • డిసెంబర్‌లో భారత్‌లోని పలు నగరాల్లో పర్యటించనున్న మెస్సీ
  • కేరళ పర్యటన రద్దవడంతో హైదరాబాద్‌కు వేదిక మార్పు
  • కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో సందడి చేయనున్న మెస్సీ
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ త్వరలో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు రానున్నారు. డిసెంబర్‌లో ఆయన భారత పర్యటనకు రానుండగా, దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సందడి చేయనున్నారు. తొలుత దక్షిణాదిన కేరళలో పర్యటించాలని అనుకున్నప్పటికీ, ఆ వేదిక రద్దయింది. దీంతో మెస్సీ కార్యక్రమాన్ని హైదరాబాద్‌కు మార్చాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

భారత్ పర్యటనలో భాగంగా కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో మెస్సీ సందడి చేయనున్నారు. దక్షిణాదిలో లక్షలాది మంది ఫుట్‌బాల్ అభిమానుల కోసం హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు భారత్‌లో మెస్సీ పర్యటన నిర్వాహకుడు సతాద్రు దత్తా వెల్లడించారు. వారం రోజుల్లో బుకింగ్‌లు ప్రారంభం కానున్నట్లు ఆయన తెలిపారు.

వేదిక విషయానికి వస్తే గచ్చిబౌలి లేదా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 12-13 అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున మెస్సీ కోల్‌కతాకు చేరుకుంటారు. సాల్ట్ లేక్ స్టేడియంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. డిసెంబర్ 14న ముంబై, డిసెంబర్ 15న ఢిల్లీలో పర్యటిస్తారు. ఆ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోనూ ఆయన భేటీ కానున్నారని నిర్వాహకులు తెలిపారు.


More Telugu News