జూబ్లీహిల్స్‌లో ఓటర్లను రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారు: ఈసీకి బీజేపీ నేతల ఫిర్యాదు

  • పథకాలు రద్దవుతాయని బెదిరిస్తున్నారని ఫిర్యాదు
  • ఈసీని కలిసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్
  • రేవంత్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుంటే పథకాలు రద్దవుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటర్లను బెదిరిస్తున్నారని బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్ పలువురు పార్టీ నాయకులతో కలిసి ఈసీకి ఫిర్యాదు చేశారు.

పథకాలు రద్దవుతాయని బెదిరించిన ముఖ్యమంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు రోజుల ముందు, అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై కూడా బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల సమయంలో ఓ వర్గం ఓట్ల కోసం ఆయనకు మంత్రి పదవి ఇస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

బ్లాక్ మెయిల్ రాజకీయాలు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో, కాంగ్రెస్‌కు ఓటు వేయని వారికి ప్రభుత్వం నుంచి లభించే ప్రయోజనాలను ఆపేస్తామని ప్రజలను బెదిరించడాన్ని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తప్పుబట్టారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, రేవంత్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని తెలియజేశారు.

23 నెలల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన 420 హామీలలో దేనిని కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుంటే రేషన్ కట్ అవుతుందని, పెన్షన్ రాదని చెప్పడం బ్లాక్‌మెయిల్ కిందకు వస్తుందని అన్నారు.



More Telugu News