ఇందిరాగాంధీ ప్రపంచ దేశాలను శాసిస్తే.. మోదీని ప్రపంచ దేశాలు శాసిస్తున్నాయి: జగ్గారెడ్డి

  • రాహుల్ దేశ ప్రధాని కావాలన్న జగ్గారెడ్డి
  • నిధులు తేవడంలో కేసీఆర్, జగన్, బాబు విఫలమయ్యారని ఎద్దేవా
  • మోదీ పాలనలో ఉద్యోగాలు, ఉపాధి కరువయ్యాయని వ్యాఖ్య
దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ ప్రపంచ దేశాలను శాసిస్తే, నేడు ప్రధాని మోదీని ప్రపంచ దేశాలు శాసిస్తున్నాయని ఆయన విమర్శించారు.

తెలంగాణలో 14, ఆంధ్రప్రదేశ్‌లో 20 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ ప్రధాని అయితే తెలంగాణ అభివృద్ధి చెందడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతాయని హామీ ఇచ్చారు. రెండు రాష్ట్రాల ప్రజలు ఈ విషయంపై ఇప్పటి నుంచే ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో పదేళ్లు కేసీఆర్... ఏపీలో జగన్, చంద్రబాబు ముఖ్యమంత్రులుగా ఉండి కేంద్రంలోని బీజేపీకి మద్దతు ఇచ్చినా, రాష్ట్రాలకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని జగ్గారెడ్డి ఆరోపించారు. రాజీవ్ గాంధీ చేపట్టిన సంస్కరణల వల్లే దేశంలో ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, నేడు కోట్లాది మందికి ఉపాధి లభిస్తోందని గుర్తు చేశారు. యూపీఏ హయాంలో తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం గ్రామాల్లో పేదలకు అండగా నిలిచిందన్నారు.

గత పదేళ్ల బీజేపీ పాలనలో మహిళలకు ఉపాధి, యువతకు ఉద్యోగాలు దొరకలేదని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లోని నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చిన ప్రధాని మోదీని ప్రజలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేసీఆర్, జగన్, చంద్రబాబు ముగ్గురూ మోదీ నీడలోనే పాలన సాగించారని విమర్శించారు. దేశవ్యాప్తంగా 300 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని ప్రజలను కోరారు. మాట ఇస్తే నిలబెట్టుకునే వ్యక్తి రాహుల్ గాంధీ అని, ఆయన కుటుంబం అలాంటిదేనని జగ్గారెడ్డి పేర్కొన్నారు. 


More Telugu News