జ్యువెలరీ యాడ్‌లో తేజస్విని... చెల్లెలి పెర్ఫార్మెన్ప్ పై పొంగిపోయిన నారా బ్రహ్మణి

  • తొలిసారి తెరపై కనిపించిన బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని
  • ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ యాడ్‌లో నటించిన తేజస్విని
  • సోదరిపై ప్రశంసల వర్షం కురిపించిన నారా బ్రహ్మణి
  • నాన్నగారి సహజ నటనను పుణికిపుచ్చుకున్నావని కొనియాడిన బ్రహ్మణి
  • ఇది ఆరంభం మాత్రమేనంటూ సోదరికి శుభాకాంక్షలు
  • తన ప్రయాణంపై ఆనందం వ్యక్తం చేసిన తేజస్విని
నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తొలిసారి కెమెరా ముందు కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలో ఆమె నటించారు. ఈ సందర్భంగా తేజస్వినిపై ఆమె సోదరి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె తన ఆనందాన్ని పంచుకున్నారు.

"తేజూ, నిన్ను ఇలా చూస్తుంటే గర్వంగా ఉంది. నువ్వు తొలిసారి తెరపై కనిపించడం నా మనసుకు ఎంతో సంతోషాన్నిచ్చింది. నీ హుందాతనం, ఆత్మవిశ్వాసం, సహజమైన స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉన్నాయి. చూస్తుంటే నాన్నగారి సహజ నటనను నువ్వు పుణికిపుచ్చుకున్నట్టున్నావు! భవిష్యత్తులో మరెన్నో మైలురాళ్లు అందుకోవాలని కోరుకుంటున్నాను. ఇది ఆరంభం మాత్రమే!" అని బ్రహ్మణి తన పోస్టులో పేర్కొన్నారు.

మరోవైపు, తన ఆన్-స్క్రీన్ ప్రయాణంపై తేజస్విని కూడా స్పందించారు. "నా తొలి ఆన్-స్క్రీన్ క్షణాలను మీ అందరితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్, కౌస్తుభ హై జ్యువెలరీ డిజైన్ స్టూడియోతో ఈ అందమైన ప్రయాణాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఇది సాధ్యమయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ ఆదరణ, ఆశీస్సులకు ఎప్పటికీ కృతజ్ఞురాలిగా ఉంటాను" అని తేజస్విని తన పోస్టులో తెలిపారు.

సాధారణంగా వ్యాపార వ్యవహారాల్లో ఉండే తేజస్విని, ఇలా అనూహ్యంగా యాడ్‌లో కనిపించడంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మణి వ్యాపార రంగంలో రాణిస్తుండగా, తేజస్విని గ్లామర్ రంగం వైపు అడుగులు వేయడం ఆసక్తికరంగా మారింది.


More Telugu News