జెమీమాపై ఆస్ట్రేలియా మీడియా ప్రశంసలు

  • ఆమె ఓ అద్భుతమంటూ పతాక శీర్షికలు
  • ప్రత్యర్థి ఆటగాళ్లపై అక్కసు వెళ్లగక్కడంలో ఆస్ట్రేలియా మీడియా ప్రసిద్ధి
  • మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా ఓటమిపై భిన్న స్పందన
ఆస్ట్రేలియా జట్టు ఓటమి పాలైన సందర్భాల్లో ప్రత్యర్థి జట్టుపై ఆసీస్ మీడియా అక్కసు వెళ్లగక్కుతుంది. పురుషుల జట్టైనా, మహిళల జట్టైనా, క్రికెట్ అయినా మరో ఆటైనా.. ప్రత్యర్థి జట్టును కించపరిచేలా, వారి విజయాన్ని తక్కువచేసి కథనాలు ప్రచురిస్తుంది. ఈ విషయంలో ఆస్ట్రేలియా మీడియా చాలా ప్రసిద్ధి పొందింది. అయితే, తొలిసారి అక్కడి మీడియా భిన్నంగా స్పందించింది. భారత్ లో జరుగుతున్న మహిళల ప్రపంచకప్ టోర్నీలో భాగంగా గురువారం ఆస్ట్రేలియా – భారత్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు భారత్ కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో భారత జట్టు ఆల్ రౌండర్ జెమీమా రోడ్రిగ్స్ అద్భుత సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓటమి పాలైనప్పటికీ ఆస్ట్రేలియా మీడియా తమ ఆనవాయతీకి విరుద్ధంగా భారత ఆల్ రౌండర్ జెమీమాపై ప్రశంసల జల్లు కురిపించింది. పతాక శీర్షికల్లో జెమీమాపై కథనం ప్రచురించింది. తమ జట్టు కెప్టెన్‌ ఎలీసా హీలీపై విమర్శలు చేసింది. జెమీమా ఇచ్చిన క్యాచ్‌ను చేజార్చడం వల్లే తమ జట్టు ఓడిపోయిందని అందులో పేర్కొన్నాయి.

ఆసీస్‌ మీడియా ఏబీసీ న్యూస్ జెమీమా ప్రదర్శనను అభినందిస్తూ ‘స్టన్నింగ్‌ ఇన్నింగ్స్‌. అద్భుతమైన లక్ష్య ఛేదన’ అంటూ కామెంట్ చేసింది. ‘గుడ్‌ మార్నింగ్‌ ఆస్ట్రేలియా. భారత్‌ అద్భుత ప్రదర్శనతో వరల్డ్‌ కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కథ ముగిసింది’ అని పోస్టు పెట్టింది. ‘ఆస్ట్రేలియా వరల్డ్‌ కప్‌ నుంచి నిష్క్రమించడానికి ప్రధాన కారణం క్యాచ్‌లు డ్రాప్‌ చేయడమే. జెమీమా జీవితకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడింది’’ అని ఫాక్స్‌ క్రికెట్‌ కథనం ప్రచురించింది.


More Telugu News