Premalatha Vijayakanth: తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. స్టాలిన్ కూటమిలోకి 'కెప్టెన్' పార్టీ!

Premalatha Vijayakanth DMDK joins Stalin alliance in Tamil Nadu
షార్ట్స్‌లో చూడండి
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇన్నాళ్లూ ప్రత్యర్థులుగా ఉన్న అధికార డీఎంకే, ప్రతిపక్ష డీఎండీకే పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. గురువారం చెన్నైలోని ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నివాసంలో డీఎండీకే అధినేత్రి ప్రేమలత విజయకాంత్ ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత ఇరు పార్టీలు కలిసి పనిచేయనున్నట్టు అధికారికంగా ప్రకటించాయి.

ఈ సందర్భంగా ప్రేమలత మాట్లాడుతూ... "ద్రావిడ మోడల్ పాలన కొనసాగేందుకు, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం" అని తెలిపారు. తన భర్త, కెప్టెన్ విజయకాంత్ జీవించి ఉన్నప్పుడే (2016లోనే) ఈ కూటమి ఏర్పడాల్సిందని, పదేళ్ల తర్వాత ఇప్పుడు అది సాధ్యమైందని ఆమె కొంత భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. తమ కూటమి 200కు పైగా స్థానాల్లో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

గతంలో 2011 నుంచి అన్నాడీఎంకే మిత్రపక్షంగా కొనసాగిన డీఎండీకే, ఇప్పుడు అనూహ్యంగా డీఎంకే వైపు మొగ్గుచూపడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తర, మధ్య తమిళనాడులోని కడలూరు, విల్లుపురం వంటి జిల్లాల్లో డీఎండీకేకు చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది. ఈ పరిణామంపై అన్నాడీఎంకే నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రేమలత నిర్ణయాన్ని విజయకాంత్ ఆత్మ క్షమించదని విమర్శించారు.

తాజా సమాచారం ప్రకారం, పొత్తులో భాగంగా డీఎండీకేకు 7 అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక రాజ్యసభ సీటును కేటాయించేందుకు డీఎంకే అంగీకరించింది. మార్చి 5తో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి.
Go Back to Shorts
Premalatha Vijayakanth
DMK
DMDK
Tamil Nadu Politics
MK Stalin
Tamil Nadu Assembly Elections
AIADMK
Tamil Nadu alliance
Vijayakanth
Tamil political news

More Telugu News