భారత్‌లో మాకు ఆల్ టైమ్ రికార్డ్ రెవెన్యూ: యాపిల్ సీఈఓ టిమ్ కుక్

  • భారత్‌లో ఆల్‌టైమ్ రికార్డు ఆదాయం నమోదు చేసిన యాపిల్
  • సెప్టెంబర్ త్రైమాసికంలో 102.5 బిలియన్ డాలర్ల రికార్డు రెవెన్యూ
  • ఐఫోన్ అమ్మకాలు గణనీయంగా పెరగడమే కారణమన్న యాపిల్
  • అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో అమ్మకాలు పెరిగాయన్న టిమ్ కుక్
  • వాటాదారులకు షేరుకు 0.26 డాలర్ల డివిడెండ్ ప్రకటన
టెక్ దిగ్గజం యాపిల్, సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అద్భుతమైన ఆర్థిక ఫలితాలను న‌మోదు చేసింది. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో రికార్డు స్థాయిలో ఆదాయం సాధించినట్లు కంపెనీ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు. ఐఫోన్ల అమ్మకాలు భారీగా పెరగడంతో ఇండియాలో తమకు ఆల్ టైమ్ రెవెన్యూ రికార్డ్ నమోదైందని ఆయన స్పష్టం చేశారు.

గురువారం కంపెనీ ఆర్థిక ఫలితాలను విడుదల చేసిన అనంతరం టిమ్ కుక్ విశ్లేషకులతో మాట్లాడారు. "భారత్, యూఏఈ వంటి వర్ధమాన మార్కెట్లలో కొత్త స్టోర్లను ప్రారంభించాం. మా అత్యుత్తమ ఉత్పత్తులతో ఈ ఏడాది అత్యంత రద్దీ సీజన్‌కు సిద్ధమవుతున్నాం" అని ఆయన తెలిపారు. అమెరికా, కెనడా, పశ్చిమ యూరప్, జపాన్, కొరియా వంటి డజన్ల కొద్దీ దేశాల్లో కూడా రికార్డు స్థాయి అమ్మకాలు నమోదైనట్లు టిమ్ కుక్ వెల్ల‌డించారు. 

ఈ త్రైమాసికంలో ఐఫోన్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా 49 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 6 శాతం అధికమని కంపెనీ పేర్కొంది. యాపిల్ సీఎఫ్‌ఓ కెవాన్ పరేఖ్ మాట్లాడుతూ... "భారత్‌లో ఆల్ టైమ్ రికార్డ్ నమోదు చేశాం. లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా వంటి అనేక అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో సెప్టెంబర్ త్రైమాసికంలో రికార్డులు సృష్టించాం" అని వివరించారు. 

2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (సెప్టెంబర్ 27తో ముగిసిన) యాపిల్ మొత్తం 102.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 8 శాతం ఎక్కువ. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం 416 బిలియన్ డాలర్లకు చేరుకుందని పరేఖ్ తెలిపారు.

కొత్తగా విడుదలైన ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్, ఐఫోన్ ఎయిర్ లైనప్‌తో పాటు ఎయిర్‌పాడ్స్ ప్రో 3, యాపిల్ వాచ్ సిరీస్ అమ్మకాల వల్లే ఈ వృద్ధి సాధ్యమైందని కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో తమ వాటాదారులకు ప్రతి షేరుకు 0.26 డాలర్ల చొప్పున డివిడెండ్ చెల్లించనున్నట్లు యాపిల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రకటించింది. ఈ డివిడెండ్ నవంబర్ 13న వాటాదారులకు అందనుంది.


More Telugu News